జైపూర్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న మోహన్‌లాల్ సుఖదియా యూనివర్సిటీలో విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఆ వర్సిటీలో ఓ ఉడుత(Squirrel) చాలా క్రూరంగా ప్రవర్తిస్తోంది. గడిచిన ఆరు వారాల్లో ఆ ఉడుత సుమారు 20 మందిని కరిచినట్లు తెలిసింది. ఆర్ట్స్ కాలేజీలోని సైకాలజీ డిపార్ట్మెంట్ వద్ద ఆ ఉడుత విద్యార్థులు, సిబ్బందిని టార్గెట్ చేస్తున్నది. ఇటీవల ఆ వర్సిటీ డీన్పైన కూడా దాడి చేసింది. ఉగ్రంగా మారిన ఆ ఉడతను చూసి ఇప్పుడు విద్యార్థులు, స్టాఫ్ భయపడుతున్నారు. సైకాలజీ డిపార్ట్మెంట్ వైపు వెళ్లాలంటే వణుకుతున్నారు. డిపార్ట్మెంట్ సమీపంలో గూడు ఏర్పాటు చేసుకున్న ఉడుత.. అటు వైపు నుంచి ఎవరు వచ్చినా వారిపై దాడి చేస్తున్నది.
దీంతో ప్రస్తుతం వర్సిటీ సిబ్బంధి హై అలర్ట్‌లో ఉంటున్నారు. ఆ ఉడుతను పట్టుకునేందుకు రెండుసార్లు కేజ్‌లను పెట్టారు. కానీ తెలివైన ఆ జంతువు వాటి నుంచి తప్పించుకున్నది. ఉడుత కరిస్తే రేబిస్ రాదు, కానీ టెటానస్ ఇంజెక్షన్ ఇప్పించుకోవాలని డాక్టర్ శైలేంద్ర కుమార్ తెలిపారు.పాక్షికంగా కంటి చూపు మందగించినా లేక ఎక్కువ రంగుల వల్ల చికాగుకు లోనైనా జంతువుల ప్రవర్తన దూకుడుగా మారుతుందని ఆ డాక్టర్ చెప్పారు.