న్యూఢిల్లీ: టీమిండియా క్రికెట్ జట్టు చీఫ్ కోచ్(Team India Coach) పదవికి బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే జూన్‌లో రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో.. కొత్త కోచ్ కోసం వెతుకులాట ప్రారంభమైంది. అమెరికాలో జరిగే టీ20 వరల్డ్‌కప్‌తో ద్రావిడ్ బాధ్యతలు ముగియనున్నాయి. బీసీసీఐ ప్రకారం కొత్త కోచ్ జూలై ఒకటో తేదీ నుంచి బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది.
మళ్లీ చీఫ్ కోచ్‌గా కొనసాగేందుకు రాహుల్ ద్రవిడ్‌కు ఇష్టం లేదు. ఒకవేళ హెడ్ కోచ్‌గా కొనసాగాలంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందే అని బీసీసీఐ కార్యదర్శి జే షా తెలిపారు. కానీ కొన్ని మీడియా కథనాల ప్రకారం చీఫ్ కోచ్ పదవిలో కొనసాగేందుకు రాహుల్ ద్రవిడ్‌కు ఆసక్తి లేదని తేలింది. అయితే ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్‌గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్‌కు.. బహుశా చీఫ్ కోచ్ పదవి దక్కే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆ బాధ్యతలు స్వీకరించేందుకు వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది.
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ .. కోచ్ బాధ్యతలను చేపట్టే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఫ్లెమింగ్‌కు బీసీసీఐ ఛాన్స్ ఇవ్వనున్నట్లు కొన్ని వర్గాల ద్వారా స్పష్టం అవుతోంది. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు హెడ్ కోచ్‌గా ఫ్లెమింగ్ ఉన్నాడు. అతను కోచ్‌గా ఉన్న సమయంలోనే సీఎస్కే అయిదు సార్లు ఐపీఎల్ నెగ్గింది. ఫ్లెమింగ్ మేనేజ్మెంట్ స్కిల్స్‌ను దృష్టిలో పెట్టుకుని అతనికి హెడ్ కోచ్ బాధ్యతలను అప్పగించే అవకాశాలు ఉన్నట్లు అర్థమవుతోంది. బీసీసీఐ కూడా అతని వైపు మొగ్గు చూపుతున్నట్లు కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి.