చెన్నై: ప్రభుత్వ కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో తొలగింపుపై వివాదం చెలరేగింది. తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. వేప్పత్తూర్ పంచాయతీ కార్యాలయంలోని ప్రధాని మోదీ ఫొటోను భర్త ఆదేశాల మేరకు చైర్పర్సన్ అంజమ్మాళ్ ఇటీవల తొలగించారు. దీనిపై బీజేపీ కార్యకర్తలు నిరనన తెలిపారు. అంతేగాక ప్రభుత్వ అధికారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
బీజేపీ కౌన్సిలర్ ఎస్ చంద్రశేఖరన్ ప్రధాని మోదీ ఫోటోను కార్యనిర్వాహక అధికారికి ఇటీవల అందజేశారు. దీనిని పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేయాలని కోరారు. అయితే ఈ నెల 12న చైర్పర్సన్ అంజమ్మల్ ఆ ఫొటోను తొలగించి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు ఇచ్చారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఆ ఫొటోను తిరిగి అక్కడ ఉంచకపోతే నిరసనను తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఈ వివాదం ముదురుతుండటంతో ఆ పంచాయతీ కార్యాలయంలో మోదీ ఫొటోను తిరిగి ఏర్పాటు చేశారు. మరోవైపు ఇలాంటి చర్యలతో బీజేపీ ఎదుగుదలకు అకాశం ఇవ్వవద్దంటూ పార్టీ నేతలు, కార్యకర్తలకు అధికార డీఎంకే సూచించింది.