లక్నో: ఒక వ్యక్తి తన ప్రియురాలిని హత్య చేశాడు. మృతదేహాన్ని సూట్‌కేస్‌లో ఉంచి ఒకచోట పడేశాడు. ఆ తర్వాత పాప పరిహారం కోసం గుండు చేయించుకున్నాడు. గంగా నదిలో స్నానం చేశాడు. మహిళ హత్యపై దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. (Man Kills Girlfriend, Takes Dip In Ganga) ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 28న జౌన్పూర్ జేసీ క్రాస్‌రోడ్స్, వాజిద్పూర్ కూడలిలో హాస్పిటల్ ముందున్న చెత్త కుప్ప సమీపంలోని పొదల వద్ద ఎర్రటి సూట్‌కేస్ పడి ఉంది.
కాగా, ఈ విషయం తెలిసిన పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. సూట్‌కేసులో మహిళ మృతదేహాం ఉండటం చూసి షాక్ అయ్యారు. వారణాసి జిల్లాలోని మురాడియో గ్రామానికి చెందిన 25 ఏళ్ల అనన్య సహానిగా మృతిరాలిని గుర్తించారు. మృతదేహం లభించిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. మహిళ హత్య కేసును 24 గంటల్లో ఛేదించారు. నిందితుడైన ఆమె ప్రియుడు విశాల్‌ను రైల్వే స్టేషన్ వద్ద అరెస్ట్ చేశారు.
మరోవైపు వారణాసికి చెందిన విశాల్, అనన్య 2019 నుంచి ప్రేమించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇది తెలిసిన కుటుంబ సభ్యులు మరో వ్యక్తితో ఆమెకు పెళ్లి చేసినట్లు చెప్పారు. అయితే వివాహం తర్వాత కూడా ఆ జంట కలుసుకున్నారని, ఇది తెలిసి మూడేళ్ల కిందట భర్త ఆమెను వదిలేశాడని అన్నారు.
కాగా, జౌన్‌పూర్‌లో జాబ్ చేస్తున్న అనన్య ఒక ఇంట్లో ఒంటరిగా నివస్తున్నదని పోలీసులు తెలిపారు. విశాల్ ఆమెను తరుచుగా కలిసేవాడని చెప్పారు. ఫిబ్రవరి 24న విశాల్ వారణాసి నుంచి వచ్చి అనన్యను కలిశాడని, ఆ రాత్రి అక్కడ ఉన్నట్లు దర్యాప్తులో తెలిసిందన్నారు. మరునాడు ఉదయం వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కోపంతో అనన్య తలపై ఇనుప రాడ్‌తో విశాల్ కొట్టడంతో ఆమె మరణించిందని చెప్పారు.
మరోవైపు అనన్య మృతదేహాన్ని పడేసిన విశాల్ భయంతో పారిపోయాడని పోలీస్ అధికారి తెలిపారు. ప్రియురాలిని హత్య చేసిన అతడు పాప పరిహారం కోసం గుండు చేయించుకున్నాడని, గంగా నదిలో స్నానం చేశాడని చెప్పాడు. రైల్వే స్టేషన్ వద్ద ఉన్న అతడ్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. 24 గంటల్లో హత్య కేసును ఛేదించిన పోలీస్ బృందాన్ని ఆ అధికారి అభినందించారు.