బెంగళూరు: బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కర్ణాటక మాజీ సీఎం జగదీష్ షెట్టర్ (Jagadish Shettar) కు సొంత నియోజకవర్గంలో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయన భార్య శిల్పా భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకుంది. జగదీష్ షెట్టర్ అభిమానులు ఆయన నిర్ణయానికి పూర్తి మద్దతు తెలిపారు. సొంత నియోజకవర్గం హుబ్లీలోని ధార్వాడ్‌లో ఆయనకు గ్రాండ్‌గా స్వాగతం పలకడంతోపాటు నినాదాలతో హోరెత్తించారు.
కాగా, బీజేపీ మాజీ సీఎం, బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రతిపక్ష నేత, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జగదీష్ షెట్టర్‌కు బీజేపీ ఈసారి టికెట్ నిరాకరించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆయన నిర్ణయించారు. ఆదివారం రాత్రి ప్రత్యేక హెలికాప్టర్లో హుబ్లీ నుంచి బెంగళూరు చేరుకున్నారు. సోమవారం ఉదయం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, కాంగ్రెస్ సీనియర్ నేతల సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆ వెంటనే ఆయన సొంత నియోజకవర్గంలో పోటీ చేసేందుకు బీ ఫార్మ్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది.
మరోవైపు తనకు పార్టీ టికెట్ నిరాకరించిన బీజేపీపై జగదీష్ షెట్టర్ మండిపడ్డారు. ‘నేను సీనియర్ నాయకుడ్ని. బీజేపీ నాకు టిక్కెట్ ఇస్తుందని అనుకున్నాను. కానీ నాకు రాదని తెలియగానే షాక్ అయ్యాను. బీజేపీ నేతలెవరూ నాతో మాట్లాడలేదు. నన్ను ఒప్పించే ప్రయత్నం కూడా చేయలేదు’ అని షెట్టర్ మీడియాతో అన్నారు. తాను నిర్మించిన బీజేపీ తన పట్ల దుర్మార్గంగా ప్రవర్తించిందని, పార్టీ నుంచి బలవంతంగా వెళ్లగొట్టారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు, ప్రిన్సిపల్స్‌ను అంగీకరించి ఆ పార్టీలో చేరినట్లు వెల్లడించారు.
అనంతరం సొంత నియోజకవర్గానికి చేరుకున్న జగదీష్ షెట్టర్‌కు ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ నెల 19న నామినేషన్ దాఖలు చేస్తానని మీడియాతో ఆయన అన్నారు.