అగర్తలా: ఒక ఆలయంలో విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. పలు ఇళ్లు, వాహనాలకు నిప్పుపెట్టారు. (Houses Set On Fire In Tripura) దీంతో ఉద్రిక్తతలను నివారించేందుకు భారీగా పోలీసులను మోహరించారు. పశ్చిమ త్రిపురలోని రాణిర్బజార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం రాత్రి కైతుర్బారి ప్రాంతంలోని కాళీ దేవి విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేశారు. దీంతో మత ఘర్షణలు చెలరేగాయి. సుమారు 12 ఇళ్లతోపాటు పలు వాహనాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. అల్లరిమూకను చూసి స్థానికులు భయంతో పారిపోయారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు నివారించేందుకు నిషేధాజ్ఞలు విధించారు. భారీగా పోలీస్
బలగాలను మోహరించారు. ఈ సంఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ఒకవైపు వరదలతో అల్లాడుతున్న త్రిపురలో మత ఘర్షణలు చెలరేగడంపై రాజకీయ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి వహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.