న్యూఢిల్లీ: బీహార్లో ఓటర్ల జాబితా(Bihar Voters List)ను సవరించాలని ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లేదా ఎస్ఐఆర్ చేయాలని తన ఆదేశాల్లో సూచించింది. దీన్ని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ వ్యతిరేకించింది. ఎన్నికల సంఘం ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏడీఆర్ కేసు నమోదు చేసింది. ఈ ఏడాదిలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసీ ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టాలని ఏడీఆర్ ఎన్జీవో తన పిటీషన్లో కోరింది. ఆ ఆదేశాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21, 325, 326ని ఉల్లంఘిస్తున్నట్లు ఉందన్నారు.
ఈ పిటీషన్ను అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ ఫైల్ చేశాడు. సరైన విధానం లేకుండా ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తే లక్షలాది మంది తమ ఓటు హక్కును వినియోగించుకోలేరన్నారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరగలేవన్నారు. ఓటర్ల జాబితా సవరణకు డాక్యుమెంట్లను తక్కువ సమయంలో సమకూర్చలేమన్నారు. 2003లో చివరిసారి బీహార్లో ఓటర్ల జాబితాను సమీక్షించారు. ప్రస్తుతం బూత్ ఆఫీసర్లు ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నారు. వెరిఫికేషన్ కోసం ఇంటింట తిరుగుతున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం ఎలక్టోరల్ రోల్ రివిజన్ కొనసాగుతుందని ఈసీ పేర్కొన్నది.