న్యూఢిల్లీ: దేశంలో వ్యాక్సిన్‌కు కొరత ఉందన్న వార్తల నేపథ్యంలో కొవిషీల్డ్‌ను ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా స్పందించారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ వార్తలను ఖండించిన కొద్దిసేపటికే ఆయన ట్విటర్లో వివరణ ఇవ్వడం గమనార్హం. సీరమ్ సంస్థ తరఫున వ్యాక్సిన్ల ఉత్పత్తిపై ఓ లేఖను ఆయన ట్విటర్లో పోస్ట్ చేశారు. ఆ లేఖలో ఏముందో చూద్దాం.
నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతో ఈ వివరణ ఇస్తున్నాను. మొదటగా వ్యాక్సిన్ల తయారీ అనేది ప్రత్యేకమైన ప్రక్రియ. రాత్రికి రాత్రి వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచడం సాధ్యం కాదు. ఇక ఇండియా చాలా పెద్ద దేశం. జనాభా చాలా ఎక్కువ. అంతమందికి వ్యాక్సిన్లు తయారు చేయడం అంత సులువు కాదు. ధనిక దేశాలు కూడా వ్యాక్సిన్ల కొరతను ఎదుర్కొంటున్నాయి.
గతేడాది ఏప్రిల్ నుంచి ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాం. అన్ని రకాల సాయం మాకు అందుతోంది. ఇప్పటి వరకూ మొత్తం 26 కోట్ల డోసుల ఆర్డర్లు అందాయి. అందులో 15 కోట్లు సరఫరా చేశాం. మరో 11 కోట్ల డోసులకు కూడా పూర్తి మొత్తం రూ.1732.5 కోట్లు ఇప్పటికే మాకు అందాయి. వీటిని రానున్న నెలల్లో సరఫరా చేస్తాం. రాష్ట్రాలు, ఇతర ప్రైవేట్ వ్యక్తులకు మరో 11 కోట్ల డోసులను కూడా రానున్న నెలల్లో పంపిణీ చేస్తాం.
అందరికీ సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ పొందాలని ఉంటుంది. మేము కూడా అదే లక్ష్యంతో పని చేస్తున్నాం. దానిని అందుకోవడానికి మేము పూర్తి నిబద్ధతతో పని చేస్తాం అని అదర్ పూనావాలా స్పష్టం చేశారు. జులై వరకూ వ్యాక్సిన్ల కొరత తప్పదని, దీనికి కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అని అదర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్రం కన్నెర్ర చేయడంతో ఆయన ఈ వివరణ ఇచ్చుకున్నారు.
Amongst multiple reports it is important that correct information be shared with the public. pic.twitter.com/nzyOZwVBxH
— Adar Poonawalla (@adarpoonawalla) May 3, 2021