ముంబై: బిలియనీర్ గౌతం అదానీ రియల్ ఎస్టేట్ సంస్థ(Adani Properties)కు .. మహారాష్ట్ర సర్కారు ముంబై హౌజింగ్ ప్రాజెక్టును అప్పగించనున్నది. సుమారు 36 వేల కోట్లతో ఆ ప్రాజెక్టు చేపట్టనున్నారు. అదానీ గ్రూపునకు చెందిన అదానీ ప్రాపర్టీస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఇండ్ల నిర్మాణం చేపట్టనున్నది. గోరేగావ్ శివారు ప్రాంతంలోని మోతీలాల్ నగర్ డెవలప్మెంట్ ప్రాజెక్టును అదానీ కంపెనీ సొంతం చేసుకోనున్నది. ఆ ప్రాజెక్టు రీడెవలప్మెంట్ కోసం అత్యధికంగా బిడ్ వేసిన సంస్థగా అదానీ ప్రాపర్టీస్ నిలిచింది.
అదానీ ప్రాపర్టీస్‌కు త్వరలో లెటర్ ఆఫ్ ఇంటెంట్ అందివ్వనున్నట్లు మహారాష్ట్ర సర్కారు తెలిపింది. అదానీ గ్రూపు ప్రతినిధి ఈ అంశంపై స్పందించేందుకు నిరాకరించారు. మహారాష్ట్ర హౌజింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ఎటువంటి వివరణ ఇవ్వలేదు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు పరిధిలో ఉన్న నివాసితులకు ఏడేళ్లలో మోతీలాల్ నగర్లో కొత్తగా ఇండ్లు నిర్మించి ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం 143 ఎకరాల్లో ఆ ప్రాజెక్టు ఉన్నది.