చెన్నై: ఓ తమిళ ఫిల్మ్ దర్శకుడు తనను మానసికంగా, శారీరకంగా, లైంగికంగా వేధించినట్లు 90వ దశకానికి చెందిన నటి సౌమ్య(Actor Sowmya) ఆరోపించారు. కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీలో వేధింపులు ఉన్నట్లు హేమా కమిటీ రిపోర్టు ఇచ్చిన నేపథ్యంలో నటి సౌమ్య తన స్వరం వినిపించారు. ఓ ఆంగ్ల ఛానల్‌కు నటి సౌమ్య ఇంటర్వ్యూ ఇచ్చారు. తనను ఆ దర్శకుడు ఓ శృంగార బానిసగా వాడుకున్నట్లు ఆమె ఆరోపించారు. అయితే ఆ దర్శకుడు ఎవరన్న దానిపై ఆమె ఏమీ చెప్పలేదు. తనకు 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆ దర్శకుడు భార్యతో కలిసి తన వద్దకు వచ్చాడని, ఓ తండ్రిగా అతను బిల్డప్ ఇచ్చాడని, కానీ ఆ తర్వాత తనతో పిల్లలు కనాలన్న కోరికను ఆ డైరెక్టర్ వ్యక్తం చేసినట్లు నటి సౌమ్య వెల్లడించారు.
ఆ డైరెక్టర్ తనను పదేపదే రేప్ చేసినట్లు ఆమె ఆరోపించారు. మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన తర్వాత పరిస్థితి మరీ దారుణంగా మారిందన్నారు. 1990 దశకంలో మూడు మెగా హిట్ మూవీల్లో సౌమ్య నటించారు. కేరళ సర్కారు ఏర్పాటు చేసిన స్పెషల్ పోలీసు బృందానికి ఆ వ్యక్తి ఐడెంటిటీ వెల్లడించనున్నట్లు ఆమె చెప్పారు. తనకు జరిగిన అవమానం నుంచి కోలుకునేందుకు 30 ఏళ్లు పట్టిందని, ఇతర బాధితులు ఎవరైనా ఉంటే తమ అనుభవాలను ఫిర్యాదు చేయాలని ఆమె కోరారు.