పట్నా: కొందరు రాజకీయ నేతలు తమ ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చే క్రమంలో నోరు జారుతుంటారు. ఆవేవంతో సంచలన వ్యాఖ్యలు చేసి వివాదాల్లో ఇరుక్కుంటుంటారు. ఇప్పుడు రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) సీనియర్ నేత అబ్దుల్ బారీ సిద్ధిఖీ సైతం అలాగే ఇరకాటంలో పడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శల పాలయ్యారు. విమర్శలు తీవ్రం కావడంతో ఆయన క్షమాపణ చెప్పారు. కానీ ఆ లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
మహిళా రిజర్వేషన్ చట్టం పేరు చెప్పుకుని ఇక లిప్‌స్టిక్, బాబ్-కట్ హెయిర్‌తో ఉన్న మహిళలు మాత్రమే ముందుకు వస్తారని, కాబట్టి వెనుకబడిన, అత్యంత వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలకు కూడా కేంద్ర ప్రభుత్వం కోటాను నిర్ణయించాలని అబ్దుల్ బారీ సిద్ధిఖీ డిమాండ్ చేశారు. లేదంటే లిప్‌స్టిక్ వేసుకున్న, బాబ్-కట్ జుట్టుతో ఉన్న వాళ్లు వెనుకబడిన మహిళల హక్కులను కాలరాస్తారని వ్యాఖ్యానించారు.
బిహార్‌లోని ముజఫర్‌నగర్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యల్లో ఆంతర్యం గురించి పట్టించుకోకుండా మహిళలను కించపర్చేలా సిద్ధిఖీ లిప్‌స్టిక్, బాబ్-కట్ పదాలను ఉపయోగించాడని బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ గానీ, ఇండియా కూటమి గానీ ఈ వ్యాఖ్యలను ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలకు అబ్దుల్ బారి సిద్దిఖీ వివరణ ఇచ్చారు. తాను ప్రసంగించిన సభలో వందలాది మంది గ్రామీణ మహిళలు ఉన్నారని.. వారి భాషలో అర్థమయ్యేలా చెప్పేందుకు తాను ‘లిప్‌స్టిక్, బాబ్-కట్’ వంటి పదాలు వాడానని స్పష్టం చేశారు. అంతే తప్ప ఎవరినీ నొప్పించడం తన ఉద్దేశం కాదన్నారు. తన మాటలు ఎవరికైనా బాధ కలిగించి ఉంటే క్షమించాలని కోరారు.