న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం నాలుగో జాబితా విడుదల చేసింది. (AAP’s 4th list) తుది జాబితాలో 38 మంది అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. ఆప్ చీఫ్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న న్యూఢిల్లీ సీటు నుంచి అలాగే కల్కాజీ నుంచి సీఎం అతిషి పోటీ చేయనున్నారు. గ్రేటర్ కైలాష్ నుంచి మంత్రి సౌరభ్ భరద్వాజ్, బాబర్పూర్ నుంచి గోపాల్ రాయ్ బరిలోకి దిగుతున్నారు. శకుర్ బస్తీ నుంచి సత్యేంద్ర కుమార్ జైన్, రాజిందర్ నగర్ నుంచి దుర్గేష్ పాఠక్ పోటీ చేయనున్నారు.
కాగా, తుది జాబితా ప్రకటనతో ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాలకు అభ్యర్థులను ఆప్ ఖరారు చేసింది. తమ పార్టీ పూర్తి విశ్వాసంతో, సన్నాహాలతో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ‘బీజేపీ కనిపించదు. సీఎం ఫేస్ వ్యక్తి, బృందం, ప్రణాళిక, ఢిల్లీపై దృష్టి వారికి లేదు. వారికి ఒకే ఒక్క నినాదం ఉంది. ‘కేజ్రీవాల్‌ను తొలగించండి’. ఈ ఐదేళ్లలో ఏమి చేశారో వారిని అడగండి. ‘కేజ్రీవాల్‌ను మేం దుర్భాషలాడాం’ అని చెబుతారు’ అని విమర్శించారు.
మరోవైపు ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై బెయిల్‌పై విడుదలైన అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేశారు. 2025 ఫిబ్రవరిలో జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ‘ప్రజాకోర్టు’ తీర్పు తర్వాత మాత్రమే తిరిగి ఆ పదవి చేపడతానని అన్నారు. అలాగే కాంగ్రెస్‌తో ముందస్తు ఎన్నికల పొత్తుకు అవకాశం లేదని తేల్చిచెప్పారు. సొంత బలంతోనే తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.