చండీగఢ్: శిరోమణి అకాలీదళ్ నేత, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇది వారిద్దరి మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఆప్ నాయకుడిపై అకాలీదళ్ నేత కాల్పులు జరిపాడు. (AAP Leader Shot) తీవ్రంగా గాయపడిన ఆప్ నేతను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పంజాబ్‌లోని ఫజిల్కా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శిరోమణి అకాలీదళ్‌కు చెందిన మాజీ ఎంపీ జోరా సింగ్ మాన్ కుమారుడు వర్దేవ్ సింగ్ నోని మాన్ శనివారం తన అనుచరులతో కలిసి పాఠశాలకు సంబంధించిన ఫైల్ క్లియర్ చేయమని అడిగేందుకు బీడీపీవో కార్యాలయానికి వచ్చాడు. అయితే అధికారి నిరాకరించడంతో ఆగ్రహంతో బయటకు వెళ్లాడు.
కాగా, బీడీపీవో కార్యాలయం బయట ఉన్న ఆప్ నేత మన్దీప్ సింగ్ బ్రార్‌తో వర్దేవ్ సింగ్ వాగ్వాదానికి దిగాడు. ఈ సందర్భంగా వారి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన వర్దేవ్ సింగ్ తన వద్ద ఉన్న గన్‌తో ఆప్ నేత మన్దీప్ సింగ్, అతడి అనుచరులపై కాల్పులు జరిపాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆప్ నేతను జలాలాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో లూథియానాలోని జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఈ కాల్పుల్లో మరో ఆప్ కార్యకర్త కూడా గాయపడినట్లు సమాచారం.
మరోవైపు కాల్పుల సమాచారం గురించి తెలుసుకున్న ఫాజిల్కా సీనియర్ పోలీసు అధికారి వరీందర్ సింగ్ బ్రార్, జలాలాబాద్ చేరుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.