న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో (Delhi Elections) అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), గట్టి పోటీ ఇస్తున్న బీజేపీ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. బీజేపీ డబ్బులు పంపిణీ చేస్తున్నదని, పోలీసులతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని ఆప్ ఆరోపించింది. అయితే బుర్ఖాలు ధరించిన మహిళలతో నకిలీ ఓట్లు వేయిస్తున్నారని ఆప్‌పై బీజేపీ మండిపడింది. జంగ్‌పురాలో ఆప్ నేత మనీష్ సిసోడియా ఢిల్లీ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఒక భవనంలో డబ్బులు పంచుతున్నారని బీజేపీపై ఆరోపించారు. దీనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
కాగా, సీలంపూర్‌లో ఆప్ ఎన్నికల దుర్వినియోగానికి పాల్పడిందని బీజేపీ ఆరోపించింది. బుర్ఖాలు ధరించిన మహిళలు పోలింగ్ కేంద్రంలో నకిలీ ఓట్లు వేస్తున్నారని ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఆరోపణలను పోలీసులు ఖండించారు. ఇద్దరు మహిళా ఓటర్లకు ఒకే పేరు, చిరునామా ఉండటం గందరగోళానికి దారితీసిందని తెలిపారు. జంగ్‌పురాలో నగదు పంపిణీ ఆరోపణలను పరిశీలిస్తామని చెప్పారు.
మరోవైపు ఢిల్లీలోని చిరాగ్‌లో బారికేడింగ్ విషయంలో సీనియర్ పోలీస్ అధికారి, ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ మధ్య వాగ్వాదం జరిగినట్లు వార్తలొచ్చాయి. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు బుధవారం పోలింగ్ జరిగింది. 1.56 కోట్లకుపైగా ఉన్న ఓటర్లు 699 మంది అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయించనున్నారు. ఫిబ్రవరి 8న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.