న్యూఢిల్లీ : ఐదేళ్ల లోపు ఆధార్ పొందిన పిల్లలు ఏడేళ్ల వయసు దాటిన తర్వాత తమ బయోమెట్రిక్స్‌ని అప్డేట్ చేసుకోవాలని, లేని పక్షంలో వారి ఆధార్ డీయాక్టివేట్ అయ్యే ముప్పు ఉందని మంగళవారం ఓ అధికార ప్రకటన హెచ్చరించింది. మాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్(ఎంబీయూ) ప్రక్రియ పూర్తి చేసుకోవాలని కోరుతూ పిల్లల ఆధార్‌లో నమోదైన ఫోన్ నంబర్లకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) నుంచి మెసేజ్‌లు వెళుతున్నాయి. పిల్లలు తమ బయోమెట్రిక్స్‌ని అప్డేట్ చేసుకోకపోతే ఆధార్‌తో ముడిపడిన వివిధ కార్యక్రమాలు పొందడంలో పిల్లలు ఇబ్బంది పడతారని యూఐడీఏఐ అధికారి ఒకరు తెలిపారు.
ఐదేళ్లలోపు పిల్లలకు వారి ఫొటో, పేరు, జన్మదినం, జెండర్, చిరునామా, ఇతర ధృవీకరణ పత్రాల ఆధారంగా ఆధార్ లభిస్తుంది. ఐదేళ్లలోపు పిల్లల ఆధార్ నమోదుకు వారి చేతిముద్రలు, ఐరిస్ బయోమెట్రిక్స్ అవసరం లేదు. ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వయసు లోపల ఎంబీయూ ఉచితంగా చేసుకోవచ్చు. పాఠశాల అడ్మిషన్లు, ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ల నమోదుకు, స్కాలర్‌షిప్‌ల ప్రయోజనాలు పొందడానికి, ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలు తదితర ప్రయోజనాలు పొందడానికి బయోమెట్రిక్స్‌తో అప్డేట్ చేసిన ఆధార్ తప్పనిసరి.