న్యూఢిల్లీ: బీహార్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో గుర్తింపు పత్రంగా ఆధార్‌ను పరిగణించక పోవడం పట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇన్నాళ్లూ అన్ని పథకాలకు ఆధార్ కార్డే ఆధారమని పేర్కొంటూ వచ్చిన కేంద్రం ఇప్పుడు దానిని ఎందుకు గుర్తింపు పత్రాల జాబితా నుంచి తొలగించిందని బీహార్ పౌరులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో దానిపై భారత విశిష్ట ప్రాధికార సంస్థ (ఉడాయ్) సీఈవో భువనేశ్ కుమార్ వివరణ ఇస్తూ ‘ఆధార్ ఎప్పూడూ పౌరుల తొలి గుర్తింపు కార్డు కాదు’ అని స్పష్టం చేశారు. నకిలీ ఆధార్ కార్డు పరిశ్రమను నియంత్రించడానికి ఉడాయ్ చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. ఆధార్ కార్డులు క్యూఆర్ కోడ్ ద్వారా అంతర్నిర్మిత భద్రతా యంత్రాంగాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు.
రూ.23 లక్షలకే గోల్డెన్ వీసా వార్తలు ఫేక్ ; స్పష్టం చేసిన యూఏఈ
దుబాయ్: రూ.23 లక్షలకే యూఏఈ జీవితకాల గోల్డెన్ వీసా పొందవచ్చంటూ మీడియాలో వచ్చిన వార్తలను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి చెందిన ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ(ఐసీపీ) ఖండించింది. జాతీ య, అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కథనాలన్నీ ఫేక్ న్యూస్ అంటూ కొట్టివేసింది. భారత్‌తోపాటు మరో దేశానికి చెందిన పౌరులకు నామినేషన్ ప్రాతిపదికన జీవితకాల గోల్డెన్ వీసాను యూఏఈ ప్రవేశపెడుతున్నట్లు వార్తలు వచ్చాయని ఎమిరేట్స్ వార్తా సంస్థ వామ్ తెలిపింది. ప్రస్తుతం అమలులో ఉన్న గోల్డెన్ వీసాలకు సంబంధించి క్యాటగిరీలు, షరతులు, నిబంధనలలో ఎటువంటి మార్పులు లేవని ఐసీపీ తెలిపింది. అధికారిక చట్టాలు, ప్రభుత్వం ఆమోదించిన బిల్లులు, మంత్రివర్గ నిర్ణయాల ప్రకారమే గోల్డెన్ వీసాలు జారీ చేస్తున్నట్లు పేర్కొన్నది. అధికారిక వెబ్సైట్లో ఇందుకు సంబంధించిన సమాచారం పూర్తిగా అందుబాటులో ఉందని ఐసీపీ తెలిపింది. గోల్డెన్ వీసా దరఖాస్తుల్లో ప్రాసెస్‌లో మధ్యవర్తులు లేదా కన్సల్టెన్సీల జోక్యం ఉండబోదని స్పష్టం చేసింది.