ఔరంగాబాద్: ప్రజాప్రతినిధులు ఉన్నదే ప్రజల సమస్యల పరిష్కారానికి. అందుకే ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా అధికారులు పట్టించుకోకపోతే ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకుంటారు. అప్పుడు ఆ ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారుల ద్వారా సమస్యను పరిష్కరింపజేస్తారు. కానీ ఓ యువకుడు పల్లెటూరి వాడినని తనకు ఎవ్వరూ పిల్లనియ్యట్లేదంటూ సరికొత్త సమస్యను లేవనెత్తాడు. ఆ సమస్యను ఏకంగా స్థానిక ఎమ్మెల్యేకే ఫోన్ చేసి చెప్పుకున్నాడు. ఎలాగైనా తనకు ఓ సంబంధం చూడాలని ఎమ్మెల్యేను కోరాడు.
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో సోమవారం ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కన్నాడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే (ఉద్ధవ్ థాకరే శివసేన వర్గం నేత) ఉదయ్ సింగ్ రాజ్‌పుత్‌కు ఆ నియోజకవర్గంలోని ఖుల్తాబాద్ ఏరియాకు చెందిన ఓ యువకుడు ఫోన్ చేశాడు. తనకు పెళ్లి చేసుకుందామంటే పిల్ల దొరకడం లేదని, ఓ పిల్లను చూసిపెట్టండని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశాడు.
‘ఎమ్మెల్యే గారూ నాకు పెళ్లి చేసుకొనేందుకు ఓ అమ్మాయిని వెతికి పెట్టిండి. పల్లెటూరి వాడినని నాకు ఎవరూ పిల్లని ఇవ్వడంలేదు. ఇప్పుడు చాలా గ్రామాల్లో ఇదే అసలైన సమస్యగా ఉంది. నాకు 8-9 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఊళ్లో పెళ్లీడు వచ్చిన అమ్మాయిలు కూడా ఉన్నారు. కానీ పల్లెటూరిలో ఉంటున్నందున నేను పెళ్లి చేసుకుంటానంటే ఎవరూ పిల్లను ఇవ్వడానికి సిద్ధపడటం లేదు’ అని ఎమ్మెల్యేతో ఫోన్లో యువకుడు ఆవేదన వెలిబుచ్చాడు.
దీనిపై స్పందించిన ఎమ్మెల్యే తనకు బయోడేటా పంపించాలని ఆ యువకుడికి సూచించారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే ఉదయ్‌సింగ్ రాజ్‌పూత్ మంగళవారం ఓ వార్తా సంస్థతో పంచుకున్నారు. ఇది ఆ యువకుడి ఒక్కడి సమస్య కాదని, చాలా పల్లెటూళ్లలో పరిస్థితి అలాగే ఉన్నదని పేర్కొన్నారు. ఓ గ్రామంలో రెండు వేల మంది ఉన్నారంటే వారిలో 100 నుంచి 150 మంది వరకు పెళ్లి కాని యువకులే ఉంటున్నారని చెప్పారు.
ఇలాంటి ఫోన్ కాల్స్ తనకు చాలాసార్లు వస్తున్నాయని, ఆ యువకుడి ఆందోళన గ్రామాల్లో నెలకొన్ని సమస్య తీవ్రతను ప్రతిబింబిస్తున్నదని ఎమ్మెల్యే ఉదయ్ సింగ్ అన్నారు. సమస్య ఒక్కడిది కాదు కాబట్టే తాను దీన్ని వ్యక్తిగత సమస్యగా కాకుండా ప్రజా సమస్యగా చూస్తున్నానని చెప్పారు. యువకులకు 100 ఎకరాల భూమి ఉన్నా సరే పల్లెటూళ్లో ఉంటే పిల్లను ఇవ్వడానికి అమ్మాయిల తల్లిదండ్రులు ఇష్టపడటంలేదని, పట్టణ ప్రాంతాల్లో ఉండేవారికే వాళ్లు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు.
కాగా, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2019-21) ప్రకారం మహారాష్ట్రలో స్త్రీ పురుష లింగ నిష్పత్తి.. ప్రతి 1000 మంది పురుషులకు 920 మంది స్త్రీలుగా ఉన్నది. దాంతో చాలామంది యువకులు పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు దొరకక బ్రహ్మచారులుగా మిగిలిపోవాల్సి వస్తున్నది.