గాంధీనగర్: ఇద్దరు గుజరాతీ గిరిజనులు తయారుచేసిన యాంటీ-క్లాక్ వైజ్ (గడియారం దిశకు వ్యతిరేకంగా తిరిగే) వాచ్ ఇది. సామాజిక కార్యకర్త ప్రదీప్ పటేల్, అతడి స్నేహితుడు భరత్ పటేల్ దీన్ని తయారుచేశారు. తన స్నేహితుడి ఇంట్లో యాంటీ క్లాక్ వైజ్‌లో తిరిగే పాత గడియారాన్ని చూసిన తర్వాత ఈ రిస్ట్ వాచ్‌లు తయారు చేయాలనే ఆలోచన వచ్చిందని ప్రదీప్ తెలిపారు. కొన్ని నెలలపాటు పరిశోధన చేసిన తర్వాత గత డిసెంబర్లో ఈ వాచ్‌లను తయారు చేశారు. గిరిజనుడి ఫొటో, ‘జై ఆదివాసీ’ క్యాప్షన్‌తో తయారు చేసిన వీటికి ‘ఆదివాసీ ఘడీ(ట్రైబల్ వాచ్)’ అని పేరు పెట్టారు.
‘ఇవి ప్రకృతికి అనుగుణంగా తిరుగుతాయి. గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ కుడి నుంచి ఎడమ వైపు(గడియార దిశకు వ్యతిరేకం) పరిభ్రమిస్తాయి. గిరిజనుల బృంద నృత్యాల్లోనూ కుడి నుంచి ఎడమ వైపుకు కదలికలు ఉంటాయి. మా గిరిజనుల ఆచారాలన్నీ కుడి నుంచి ఎడమ వైపుకు నిర్వహిస్తాం’ అని ప్రదీప్ వివరించారు. ఈ చేతి గడియారాలను ఈ నెల 13 నుంచి 15 వరకు గుజరాత్‌లోని ఛోటా ఉడెపూర్కు దగ్గర్లోని కవంట్ గ్రామంలో జరిగే ఆదివాసీ ఏక్తా పరిషద్‌లో ప్రదర్శన, అమ్మకానికి ఉంచనున్నారు.