ముంబై: అది బాంబే హైకోర్టు..! నిత్యం న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఇతర సిబ్బంది, ఫిర్యాదుదారులు, ప్రతివాదులతో బిజీబిజీగా ఉంటుంది. అలాంటి హైకోర్టు ఆవరణలోకి ఇవాళ అరుదైన అతిథి వచ్చింది. మరి ఆ అతిథి ఎవరనుకుంటున్నారు..? జెర్రిగుడ్డు (ఒక రకం పాము)..! అవును.. మీరు చదివేది నిజమే..! ఓ ఆరడుగుల పొడవుతున్న జెర్రిగొడ్డు ఇవాళ ఉదయం బాంబే హైకోర్టు వెలుపల ఉన్న జడ్జి చాంబర్లో చొరబడింది.
సిబ్బంది ఆ పామును చూడగానే భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానికంగా ఉన్న స్నేక్ సొసైటీ వాళ్లకు సమాచారం ఇచ్చారు. వాళ్లు ఘటనా ప్రాంతానికి చేరుకుని అది జెర్రిగొడ్డుగా గుర్తించారు. దాన్ని ఓ సంచిలో బంధించి సమీపంలోగల పాముల ఆవాస స్థలంలో వదిలేశారు.