న్యూఢిల్లీ, జూలై 26: ఢిల్లీలోని కర్ణాటక భవన్లో విధులు నిర్వహించే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు చెందిన స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ల(ఎస్‌డీవోలు) మధ్య ఘర్షణ తలెత్తింది. కర్ణాటకలో సీఎం మార్పు జరగవచ్చన్న ఊహాగానాల నేపథ్యంలో ఇద్దరు కీలక నేతలకు చెందిన అధికారుల మధ్య గొడవ రాజేసుకోవడం గమనార్హం. డిప్యూటీ సీఎంకు చెందిన ఎస్డీఓ మోహన్ కుమార్ తనను ఇతర ఉద్యోగుల సమక్షంలో చెప్పుతో కొడతానని బెదిరించినట్లు ముఖ్యమంత్రి ఎస్డీఓ హెచ్ ఆంజనేయ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ షాలినీ రజనీష్‌కి ఫిర్యాదు చేశారు.
‘నన్ను అతడు చెప్పుతో కొట్టారు. నా గౌరవం, పరువుకు ఇది భంగకరం. అతడిపై క్రిమినల్ విచారణ జరిపి నాకు న్యాయం చేయండి’ అని ఆయన తన ఫిర్యాదులో కోరారు. మోహన్ కుమార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తాను తీవ్ర వేధింపులను ఎదుర్కొంటున్నానని, తన విధులను నిర్వర్తించలేకపోతున్నానని తన ఫిర్యాదులో వాపోయారు. మోహన్ కుమార్ గత సర్వీసు రికార్డులను పరిశీలిస్తే ఆయన గతంలో ఎంఎం జోషిని కొట్టారని, సీనియర్ అధికారులంటే ఏమాత్రం గౌరవం లేదని కూడా తన ఫిర్యాదులో ఆంజనేయ తెలిపారు. ఇటువంటి గొడవలను నివారించేందుకే తాను గతంలోనే బదిలీ కోరినట్లు ఆయన పేర్కొన్నారు.
కాగా, ఈ వ్యవహారంపై విచారణ జరపాలని సీఎస్ ఆదేశించారు. ఆంజనేయ ఫిర్యాదు తనకు ఈ నెల 22న అందినట్లు ఢిల్లీలోని కర్ణాటక భవన్ రెసిడెంట్ కమిషనర్ ఇంకొంగ్ల జమీర్ ధ్రువీకరించారు. పార్టీ వర్గాల కథనం ప్రకారం.. మోహన్ కుమార్, ఆంజనేయ ఇద్దరూ పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని అవుట్ సోర్సింగ్ సిబ్బంది తొలగించినట్టు తెలుస్తున్నది. ఈ విషయం తన దృష్టికి రాలేదని..తెలుసుకున్నాక మాట్లాడతానని సీఎం సిద్ధరామయ్య తెలిపారు.