Bio Computer | స్పెషల్ టాస్క్ బ్యూరో, హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): రజినీకాంత్ ‘రోబో’ సినిమా చూశారా? మామూలు సిలికాన్ రోబోకు కృత్రిమ మేధ (ఏఐ)ను జోడించి ‘హ్యూమనాయిడ్ రోబో’గా మారుస్తారు. దీంతో మనుషులు చేసే అన్ని పనులను ఈ రోబో రెప్పపాటులోనే పూర్తి చేస్తుంది. అమెరికాలోని ఇండియానా వర్సిటీ బ్లూమింగ్టన్ శాస్త్రవేత్తలు ఇప్పుడు అలాంటి ప్రయోగాన్నే పూర్తి చేశారు. అదే ‘బయో కంప్యూటర్’
గణనలు తప్ప విశ్లేషణలతో కూడిన క్లిష్టమైన పనులను సమన్వయంతో నిర్వర్తించడం ఎలక్ట్రానిక్ కంప్యూటర్లకు సాధ్యం కాదు. పరిసరాల్లో జరుగుతున్న మార్పులను బట్టి సరైనట్టు స్పందించడం వాటికి కుదరదు. దీంతో మనిషిలాగే సమయానుకూలంగా స్పందించే వినూత్న పరికరాన్ని తీసుకొచ్చేందుకు ఇండియానా వర్సిటీ శాస్త్రవేత్తలు నిర్ణయించారు. అదే ‘బయో కంప్యూటర్’.
మెదడును పోలిన సూక్ష్మ అవయవాలను (బ్రెయిన్ ఆర్గనాయిడ్స్-బీవో) పరిశోధకులు ప్రయోగశాలలో తయారు చేశారు. వీటిలోనికి కృత్రిమ మేధ ప్రోగ్రామ్‌ను ఇంజెక్ట్ చేశారు. ఈ వ్యవస్థను ఎలక్ట్రానిక్ కంప్యూటర్‌కు అనుసంధానించారు.
ఏఐతో అనుసంధానించిన బ్రెయిన్ ఆర్గనాయిడ్స్.. ల్యాబ్‌లో తయారుచేసిన మెదడులోని ఇతర నాడీకణాల్లో ఉత్తేజిత చర్యలను పురిగొల్పుతాయి. ఎలక్ట్రానిక్స్, ఏఐ, బీవో అనుసంధానంతో ‘బయో కంప్యూటర్’ విశ్లేషణను ప్రారంభిస్తుంది. అసంపూర్ణ, విరుద్ధ సమాచారం ఇచ్చినప్పుడు సాధారణ కంప్యూటర్ డీఫాల్ట్‌గా ‘ఎర్రర్’ మెసేజ్‌ను చూయిస్తుంది. అయితే, ఇలాంటి సమాచారాన్నే బయో కంప్యూటర్‌కు ఇస్తే.. ఎక్కడ తప్పుడు ఇన్పుట్ ఇచ్చామో.. సవరణలు ఎలా చేయాలో చెప్పడమే కాదు.. అవసరమైన ఫలితాలను అంచనాతో ఈ కంప్యూటర్ వెలువరిస్తుంది. సాధారణ కంప్యూటర్లలో ట్రాన్సిస్టర్లు సమాచారాన్ని నిల్వ చేసుకొంటే ఇందులో మెదడు కణాలే సమాచారాన్ని నిల్వ చేసుకొంటాయి. విశ్లేషిస్తాయి కూడా. ఇలా ‘బయో కంప్యూటర్’ సాధారణ సిలికాన్ కంప్యూటర్ పనులతో పాటు మనిషి మాత్రమే చేయగలిగే కొన్ని ప్రత్యేక పనులను కూడా చేస్తుంది.
శాస్త్ర, సాంకేతిక రంగంలో ఇదో గొప్ప ప్రయోగమని, బయో ఇంజినీరింగ్, మెషిన్ లెర్నింగ్ వంటి సెక్టార్లలో బయో కంప్యూటర్ పాత్ర కీలకమని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రయోగం ప్రాథమిక దశలోనే ఉండటంతో ఫలితాలు కచ్చితత్వంతో రావడానికి మరికొంత సమయం పట్టొచ్చన్నారు. బయో కంప్యూటర్ మార్కెట్లోకి రావడానికి ఐదారేండ్లు వేచిచూడాల్సి రావొచ్చని అభిప్రాయపడుతున్నారు.