అలహాబాద్, జూలై 12: లైంగిక దాడి కారణంగా గర్భవతి అయిన బాలికను బిడ్డను కనమంటూ బలవంతం చేయలేమని, శిశువుకు జన్మనివ్వడం వల్ల భవిష్యత్తులో ఆమెకు అనేక ఇబ్బందికర పరిస్థితులు ఎదురవ్వవచ్చునని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. గర్భస్థ శిశువు అనారోగ్య కారణాలతో తప్ప 24 వారాల గర్భం దాటిన వారు అబార్షన్ చేయించుకోవడానికి చట్టాలు అనుమతించవని, అయితే రాజ్యాంగం న్యాయస్థానాలకు కల్పించిన కొన్ని అసాధారణ అధికారాల వల్ల 24 వారాల గర్భం దాటిన తర్వాత కూడా అబార్షన్‌కు అనుమతించే అధికారం కోర్టుకు ఉన్నదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఓ కేసులో బాలికను పరీక్షించి నివేదిక సమర్పించాలని వైద్య బృందాన్ని ఆదేశించింది.