Viral Video | కన్న కూతురు కండ్ల ముందు ఉంటేనే ఏ తండ్రికైనా ఆనందం! నాన్న పక్కన ఉంటే ఆ కూతురికి వెయ్యి ఏనుగుల బలం!! వీరిలో ఏ ఒకరు కనిపించకపోయినా మరొకరు పరితపించిపోతారు. అలాంటిది ఉన్నత విద్య కోసం అని వెళ్లిన కూతురు ఏడాదిన్నర పాటు కనిపించనంత దూరంలో ఉంటే ఏ తండ్రి అయినా ఎలా ఉండగలుగుతాడు. అందుకే ఈ తండ్రి ఉన్నఫళంగా రెక్కలు కట్టుకుని వెళ్లి కూతురి ముందు వాలిపోయాడు. దేశం కాని దేశం వెళ్లి ఆమెకు సర్ప్రైజ్ ఇచ్చాడు. ఎక్కడో ఊళ్లో పనిచేసుకుంటూ ఉండాల్సిన తండ్రి.. తన కోసం ఖండాలు దాటి వచ్చి తన ముందు నిల్చోవడంతో ఆ కూతురు కూడా చాలా ఎమోషనల్ అయ్యింది. తండ్రిని చూసిన ఆనందంలో భావోద్వేగంతో కన్నీళ్లు కార్చింది. ఆ తండ్రిని హత్తుకుని బోరున ఏడ్చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
గుజరాత్‌కు చెందిన శృత్వా దేశాయ్ గ్రాడ్యుయేషన్ కోసం కెనడా వెళ్లింది. ఒంటరియా ప్రావిన్స్‌లోని లాయలిస్ట్ కాలేజీలో చేరింది. అక్కడే స్థానికంగా ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తూ చదువు కొనసాగిస్తోంది. అయితే ఆమె విదేశాలకు వెళ్లి ఏడాదిన్నర అయినా ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు. పుట్టినప్పటి నుంచి ఇన్నిరోజులు కూతురు దూరంగా ఉండటంతో ఆమె తండ్రి విలవిల్లాడిపోయాడు. ఎలాగైనా ఆమెను చూసేందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఎలాగూ శృత్వా గ్రాడ్యుయేషన్ డే కూడా దగ్గరపడింది. దీంతో ఆ అపూర్వ ఘట్టానికి తాను కూడా హాజరుకావాలని ప్లాన్ చేసుకున్నాడు. అయితే సర్ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ విషయాన్ని ఆ తండ్రి తన కూతురికి చెప్పలేదు. ఇన్ని ఏండ్ల తర్వాత కలుస్తున్నామంటే ఆ కూతురు ఎలా ఫీలవుతుందో ప్రత్యక్షంగా చూడాలని అనుకున్నాడు. అందుకే ఆమెకు చెప్పకుండా కెనడా ఫ్లైట్ ఎక్కేశాడు. నేరుగా ఆమె పనిచేసే సూపర్ మార్కెట్‌కు వెళ్లిపోయాడు.
అక్కడ ఒక్కసారిగా డోర్ తీసుకుని వస్తున్న తండ్రిని చూసి ఒక్కసారిగా షాకయ్యింది. ఎక్కడో ఊళ్లో ఉండాల్సిన నాన్న.. కండ్ల ముందు కనిపించేసరికి ఆ ఆనందాన్ని తట్టుకోలేకపోయింది. ఆనందంతో కన్నీళ్లు కార్చింది. అలాగే కింద కూర్చుండిపోయింది. అప్పుడు ఆ తండ్రి కూడా దగ్గరకు వెళ్లి ఆమెను హత్తుకున్నాడు. దీంతో నాన్నను పట్టుకుని ఒక్కసారిగా ఏడ్చేసింది. దీనికి సంబంధించిన వీడియోను శృత్వా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ‘ ఇండియాలో ఉండాల్సిన మా నాన్న ఒక్కసారిగా కండ్ల ముందు నడుచుకుంటూ వచ్చేసరికి అవాక్కయ్యా. ఆయన్ను చూడగానే నా గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లయ్యింది. కేవలం నన్ను చూసేందుకే దేశాలు దాటి ఇంత దూరం వచ్చారా అని అనిపించింది. ఇది నా జీవితంలో మరిచిపోలేని సంఘటన’ అని రాసుకొచ్చింది. జూన్ 2న పోస్టు చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.