న్యూఢిల్లీ: దేశంలో 15 నుంచి 29 ఏండ్ల వయస్సు గల యువతలో సుమారు 8.7 కోట్ల మంది చదువుకోవడం లేదని, అలాగని ఉద్యోగం ఏదీ చేయడం లేదని, పైగా ఎటువంటి శిక్షణ కూడా తీసుకోవడం లేదని నీతి ఆయోగ్ తాజా నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు స్థానిక అవసరాలు, ఎదుగుతున్న రంగాలకు అనుగుణంగా రాయితీతో కూడిన శిక్షణ కార్యక్రమాలు అందించాల్సిన తక్షణ ఆవశ్యకత ఉందని ఈ నివేదిక స్పష్టం చేసింది. ‘రీఇమాజినింగ్ స్కిల్లింగ్ ఫర్ వికసిత్ భారత్@2047’ పేరిట విడుదల చేసిన ఈ నివేదికలో 2021లో నిర్వహించిన నేషనల్ శాంపిల్ సర్వే 78వ రౌండ్ డేటా ఆధారంగా ఈ అంచనా రూపొందించినట్లు నీతి ఆయోగ్ తెలిపింది.
గరిష్ఠ స్థాయి ఫలితాలను సాధించేందుకు నీతి ఆయోగ్ భారతదేశ శ్రామిక శక్తిని, అభ్యాసకులను ఐదు విభాగాలుగా వర్గీకరించింది. పాఠశాల విద్య, ఉన్నత(తృతీయ స్థాయి) విద్య, అధికారిక, అనధికారిక రంగాల్లో పని, విద్య, ఉపాధి లేదా శిక్షణలో లేని యువతగా పేర్కొంది. విద్యార్థులు ఇప్పటికే ఉన్న ఆర్థిక భారాలకు అదనంగా రుసుము చెల్లించి, నైపుణ్య శిక్షణను పొందలేకపోతున్నారని నీతి ఆయోగ్ పేర్కొంది. 15 నుంచి 29 ఏండ్ల మధ్య వయస్సు ఉండి చదువు, ఉద్యోగం లేదా శిక్షణ లేనివారిని, అలాగే నిరుద్యోగులుగా ఉన్నవారిని నీతి ఆయోగ్ ‘నీట్ యువత’గా పేర్కొంది.
ఈ యవత కెరీర్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం, స్వయం ఉపాధి మార్గాలు, స్థానిక అవసరాలు, కొత్త రంగాలకు అనుగుణమైన అభ్యాస అవకాశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. ముఖ్యంగా తక్కువ ఆదాయ కుటుంబాల విద్యార్థులు కళాశాల ఖర్చులు, ప్రైవేట్ ట్యూషన్ల ఖర్చులతో ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారని, ఫలితంగా డిగ్రీతో పాటు అదనంగా రుసుము చెల్లించి, నైపుణ్య శిక్షణ పొందడం ఆర్థికంగా అసాధ్యంగా మారుతున్నదని పేర్కొంది. ఫలితంగా చాలామంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ తర్వాత తమ కుటుంబాలకు ఆసరాగా నిలిచేందుకు ఏదో ఒక ఉద్యోగం లేదా ఆదాయ వనరును ఎంచుకుంటున్నారు.
మరికొందరు ఉద్యోగాల్లోకి మారే క్రమంలో నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని నీతి ఆయోగ్ తెలిపింది. తాము చదివిన విద్యార్హతలకు తగిన ఉద్యోగాల్లో కేవలం 8.25 శాతం మంది గ్రాడ్యుయేట్లు మాత్రమే పనిచేస్తున్నారని నివేదిక వెల్లడించింది. సంప్రదాయకంగా చదువుకున్న యువతలోనూ ప్రాక్టికల్ నాలెడ్జ్, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన శిక్షణ లోపించడం ఉపాధి అవకాశాలను పరిమితం చేస్తున్నదని పేర్కొంది.