న్యూఢిల్లీ, ఏప్రిల్ 26 : అధిక పనిగంటలు, ఉద్యోగ సంబంధిత అభద్రతా భావం, వేధింపుల కారణంగా ఒత్తిడికి గురవుతున్న ఉద్యోగులు ప్రపంచవ్యాప్తంగా ఏటా 8.40 లక్షల మంది మృత్యువాత పడుతున్నట్టు అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో) వెల్లడించింది. సుదీర్ఘ పనిగంటలు, ఉద్యోగ అభద్రత, నియంత్రణ లేని డిమాండ్లు, పనిప్రదేశంలో బెదిరింపులు, వేధింపుల కారణంగా మానసిక ఆందోళనకు గురవుతున్న ఉద్యోగులు గుండెపోటుకు, మానసిక రుగ్మతలకు గురవుతూ మరణిస్తున్నారని, కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారని ఆ నివేదిక వివరించింది. ఈ మరణాలకు తోడు ఉద్యోగ సంబంధిత మానసిక ఆందోళనల కారణంగా ఉద్యోగులు అనారోగ్యానికి, వైకల్యానికి లేదా అకాల మరణాలకు గురువుతున్నారని ఫలితంగా ఏటా సుమారు 4.5 కోట్ల సంవత్సరాల కాలం వృథా అవుతున్నదని తెలిపింది.
ఆర్థికంగా ఈ నష్టం జీడీపీలో 1.37 శాతం ఉంటుందని పేర్కొంది. ఆధునిక పని పరిస్థితుల్లో వృత్తిపరమైన భద్రతకు, ఆరోగ్యానికి ఈ మానసిక, సామాజికపరమైన ఆందోళనలు అత్యంత ప్రాముఖ్యమైన సవాళ్లుగా మారుతున్నాయని ఈ సర్వేకు నేతృత్వం వహించిన ఐఎల్ఓ అధికారి మానల్ అజ్జీ తెలిపారు. పని ప్రదేశాల్లో ఉద్యోగుల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పరిరక్షించడంతోపాటు ఉత్పత్తిని పెంచేందుకు, పనితీరును మెరుగుపరిచేందుకు, సుస్థిర ఆర్థిక అభివృద్ధిని సాధించేందుకు మానసిక, సామాజికపరమైన సానుకూల పని వాతావరణాన్ని నెలకొల్పాల్సిన అవసరమున్నదని అభిప్రాయపడ్డారు.