థెని (తమిళనాడు), డిసెంబర్ 24: శబరిమల యాత్ర ముగించుకొని తిరిగివస్తుండగా వాహనం అదుపుతప్పి లోయలో పడ్డ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి తమిళనాడులోని థెని జిల్లాలో ఈ దుర్ఘటన సంభవించింది. వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే లోయలో పడిపోయి ప్రమాదం జరిగినట్లు థెని జిల్లా కలెక్టర్ కేవీ మురళీధరన్ చెప్పారు. క్షతగాత్రులైన మరో ఇద్దరు దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో ఏడుగురు సంఘటనా స్థలంలోనే మరణించగా మరొకరు దవాఖానలో చికిత్స పొందుతూ మరణించినట్లు అధికార వర్గాల సమాచారం. మృతులు, క్షతగాత్రులంతా ఇదే జిల్లా అండిపట్టికి చెందిన వారనీ.. అయ్యప్ప దర్శనం ముగించుకొని ఇంటికి వస్తుండగా ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.