డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో రిటైర్డ్ ఆర్మీ బ్రిగేడియర్ అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. రెండు కార్ల మధ్య జరిగిన రోడ్డు ఛేజింగ్ (Road Rage) ఘటనకు ఆయన బలయ్యారు. ముస్సోరీ రోడ్డులో ఉన్న జోహ్రీ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఫార్చూనర్ కారును.. స్కార్పియో కారు ఛేజ్ చేసింది. అయితే స్కార్పియాలో ఉన్న వ్యక్తులు ఫార్చూనర్ కారు మీదకు ఫైరింగ్ చేశారు. ఛేజింగ్, క్రాస్ ఫైరింగ్ జరుగుతున్న సమయంలో రోడ్డుపై మాజీ ఆర్మీ బ్రిగేడియర్ ముఖేశ్ జోషి మార్నింగ్ వాక్ చేస్తున్నారు. అయితే క్రాస్ ఫైరింగ్ వల్ల ఓ బుల్లెట్ ముఖేశ్ శరీరంలోకి దూసుకెళ్లింది.
స్కార్పియోలో ఉన్న వ్యక్తులు ఫార్చూనర్ టైర్లను షూట్ చేసేందుకు ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఓ బుల్లెట్ ముఖేశ్‌ను తగిలినట్లు పోలీసులు వెల్లడించారు. బ్రిగేడియర్ జోషిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స చేస్తున్న సమయంలో అతను ప్రాణాలు కోల్పోయారు. ఓ బుల్లెట్ ఫార్చూనర్ టైర్‌కు తగలడంతో.. అది అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొన్నది. ఫార్చూనర్లో ఉన్న వ్యక్తులపై స్కార్పియా వ్యక్తులు దాడి చేశారు. వాహనాన్ని ధ్వంసం చేశారు. ఫార్చూనర్లో గాయపడ్డవారిని ఆస్పత్రిలో చేర్పించారు.
స్కార్పియోలో ప్రయాణిస్తున్న నిందితులు అందరూ పరారీ అయ్యారు. డెహ్రాడూన్ ఎస్ఎస్పీ ప్రమేంద్ర సింగ్ దోబాల్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రోడ్డు బ్లాక్‌లు ఏర్పాటు చేసి, విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఘటనకు చెందిన సీసీటీవీ ఫూటేజ్‌లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.