కోల్‌కతా : దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు కరోనా మహమ్మారి బారినపడుతున్నారు. తాజాగా ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్‌లో మంగళవారం 60 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇందులో 40 మంది విద్యార్థులు కాగా, 20 మంది పరిశోధకులు, నాన్ టీచింగ్ స్టాఫ్, ఫ్యాకల్టీ సభ్యులు మహమ్మారి బారినపడ్డారు. వైరస్ సోకిన వారంతా పలువురు ఇండ్లలో, మరికొందరు క్యాంపస్‌లో ఐసోలేషన్‌లో ఉన్నారని ఐఐటీ ఖరగ్‌పూర్ రిజిస్ట్రార్ తమల్‌నాథ్ తెలిపారు. పరిస్థితి అదుపులోనే ఉందన్నారు.
డిసెంబర్ 18న ఇన్స్టిట్యూట్ కాన్వకేషన్ తర్వాత ఐఐటీ ఖరగ్‌పూర్ ఏడాదిన్నర విరామం తర్వాత దశలవారీగా విద్యార్థులను క్యాంపస్‌కు పిలువాలని నిర్ణయించింది. కానీ, గడిచిన రెండు రోజుల్లోనే కొవిడ్ కేసులు అకస్మాత్తుగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యక్ష తరగతులను వాయిదా వేసింది. మళ్లీ ఆన్లైన్ తరగతుల నిర్వహణకు తాము కట్టుబడి ఉన్నామని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. అందరు క్యాంపస్ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాలని కోరుకుంటున్నారని, కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదన్నారు. డిసెంబర్ 27 తర్వాత దాదాపు 2వేల మంది విద్యార్థులు క్యాంపస్‌కు వచ్చారని పేర్కొన్నారు.