న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: వాహనాలకు సంబంధించిన పనులకు ఇక ఆర్టీఏ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన పనిలేదు. అందులో చాలావరకు ఇంటి నుంచే చేసుకునే వెసులుబాటు వచ్చింది. 58 రకాల ఆర్టీఏ పౌరసేవలను ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చినట్టు కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. డ్రైవింగ్ లైసెన్స్, టూరిస్టు వాహనాల లైసెన్స్, వాహనం రిజిస్ట్రేషన్, పర్మిట్, యాజమాన్య బదిలీ వంటి సేవలు అందులో ఉన్నాయి. ఆధార్ సాయంతో వాటిని ఉపయోగించుకోవచ్చు. దీంతో ఆర్టీఏ కార్యాలయాల్లో రద్దీ తగ్గిపోయి, సేవల నాణ్యత మెరుగుపడుతుందని కేంద్ర రవాణాశాఖ అభిప్రాయపడింది. ఆధార్ కార్డు లేనివారు ఇతర గుర్తింపు పత్రాల సాయంతో నేరుగా ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లి సేవలను పొందవచ్చని పేర్కొన్నది.