Highest Temperature | న్యూఢిల్లీ, మే 31: వడగాడ్పులు, భారీ ఉష్ణోగ్రతలతో ఉత్తరాది రాష్ర్టాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, జార్ఖండ్ సహా పలు రాష్ర్టాల్లో గురు, శుక్రవారాల్లో 45 నుంచి 48 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహారాష్ట్రలోకి నాగ్‌పూర్‌లోని ఓ ఆటోమెటిక్ వెదర్ స్టేషన్(ఏడబ్ల్యూఎస్)లో రికార్డు స్థాయిలో 56 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అయితే, ఇటీవల ఢిల్లీలోని ఓ ఏడబ్ల్యూఎస్లోనూ 52.9 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, రీడింగ్స్‌పై దర్యాప్తు చేస్తున్నట్టు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఇప్పుడు నాగ్‌పూర్‌లో ఇంతకంటే ఎక్కువ నమోదు కావడం పట్ల వాతావరణ శాఖ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు దాటాయి. భరించలేని ఎండవేడి, తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. వడగాడ్పులు పరిస్థితిని మరింత తీవ్రం చేస్తున్నాయి. వడదెబ్బతో దేశవ్యాప్తంగా దాదాపు 60 మందికిపైగా మృత్యువాత పడ్డారు. ఒక్క బీహార్లోనే దాదాపు 32 మంది మృతి చెందారు. వీరిలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న 10 మంది సిబ్బంది కూడా ఉన్నారు
ఢిల్లీలో తీవ్రంగా తాగునీటి కొరత
ఒకవైపు ఎండలు తాళలేక ఇబ్బందిపడుతున్న హస్తినవాసులను మంచినీటి కొరత వేధిస్తున్నది. ట్యాంకర్ల వద్ద బిందెలు, క్యాన్లతో జనం బారులు తీరుతున్నారు. హర్యానా నుంచి ఢిల్లీకి సరిపడా నీటిని విడుదల చేయనందుకే నీటి కొరత తీవ్రమయ్యిందని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపిస్తున్నది.
తెలంగాణలోనూ మండుతున్న ఎండలు
తెలంగాణలోనూ ఎండలు మండిపోతున్నాయి. మంచిర్యాల జిల్లా భీమారంలో, పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో 47.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెలపాడు, మంచిర్యాల జిల్లా నన్పూర్లో 46.9 డిగ్రీలు, నల్లగొండ జిల్లా కేతెపల్లి, ఖమ్మం జిల్లా ఖానాపూర్ హవేలీలో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.