Madhya Pradesh | భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో గుర్తుతెలియని వ్యక్తులు వదిలిపెట్టి వెళ్లిన ఓ ఎస్‌యూవీలో భారీగా నగదు, బంగారం లభించింది. కుశల్పురా రోడ్డులో ఇన్నోవా క్రిస్టా కారు నిలిపి ఉందని, అందులో చాలా మూటలు కనిపిస్తున్నాయే కాని మనుషులెవరూ లేరని గురువారం రాత్రి తమకు సమాచారం అందినట్లు డీసీపీ ప్రియాంక శుక్లా శుక్రవారం విలేకరులకు తెలిపారు.
ఐటీ శాఖకు సైతం సమాచారం అందచేయగా వారు అక్కడకు చేరుకుని కారు కిటికీ అద్దాలు పగలగొట్టి 52 కిలోల బంగారు బిస్కెట్లను, భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారని ఆమె చెప్పారు. ఎంపీ-07 సిరీస్‌లో వాహనం నంబర్ రిజిస్టర్ అయి ఉందని, దాని యజమాని పేరు చందన్ సింగ్ గౌర్గా నమోదై ఉందని డీసీపీ వివరించారు. గ్వాలియర్‌కు చెందిన ఆ వ్యక్తి గత కొంత కాలంగా భోపాల్‌లో నివసిస్తున్నట్టు ఆమె తెలిపారు. కాగా.. వాహనం నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం, నగదు విలువ మొత్తంగా రూ.52 కోట్లు ఉంటుందని ఐటీ(దర్యాప్తు) డైరెక్టర్ జనరల్ సతీష్ కె గోయల్ తెలిపారు.