లక్నో: ఉత్తరప్రదేశ్లోని (Uttar Pradesh) కాన్పూర్ దేహాత్ ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. కాన్పూర్ దేహాత్ (Kanpur Dehat) ప్రాంతంలోని హర్మౌ బంజారాడేరా (Harmau Banjaradera) అనే గ్రామంలోని ఓ గుడిసెలో అగ్ని ప్రమాదం (Fire accident) చోటుచేసుకుంది. దీంతో ఐదుగురు సజీవదహనం అయ్యారు. వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఆదివారం తెల్లవారుజామున గుడిసెలో (Hut) ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి పెదవి కావడంతో భారీగా ఎగసిపడ్డాయి. గుర్తించిన స్థానికులు మంటలను అదుపుచేయడానికి ప్రయత్నించారు. అయితే మంటలను చల్లార్చే లోపే అందులో ఉన్న కుటుంబ సభ్యులు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను సతీశ్ కుమార్, ఆయన భార్య కాజల్ (Kajal), వారి మగ్గురు పిల్లలుగా గుర్తించారు.
జిల్లా మేజిస్ట్రేట్, ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుకునేందుకు ఫోరెన్సిక్ టీమ్, డాగ్ స్క్వాడ్లను రంగంలోకి దించారు. అయితే ప్రమాదానికి షార్ట్ సర్య్కూట్ (short circuit) కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదంలో సతీశ్ తల్లి గాయపడ్డారని, ఆమెను దవాఖానకు తరలించామని అధికారులు తెలిపారు.