భోపాల్: నూతన సంవత్సర వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. హైడ్రోజన్ బెలూన్లు అమ్ముకునే వ్యక్తి ఓ బెలూన్లో గ్యాస్ నింపుతుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ముగ్గురు చిన్నారులు, బెలూన్ సెల్లర్, మరో వ్యక్తి ఉన్నారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉజ్జయినిలో స్థానిక రాజకీయ నాయకుడు ఒకరు కొవిడ్ నిబంధనలను లెక్కచేయకుండా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించాడు.
ఈ వేడుకలకు జనం భారీగా హాజరయ్యారు. ఓ బెలూన్ సెల్లర్ దగ్గర చిన్నారులు బెలూన్ల కోసం గుమిగూడారు. బెలూన్ సెల్లర్ ఒక్కొక్కరికి బెలూన్లు అమ్ముతున్నాడు. ఇంతలో అతని దగ్గరున్న సిలిండర్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ పేలుడులో బెలూన్లు అమ్మేవ్యక్తి సహా ఐదుగురు గాయపడ్డారు. వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. వారిని స్థానిక ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయిస్తున్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఇండోర్ ఆస్పత్రికి తరలించారు.