శ్రీనగర్, జూలై 8: జమ్ముకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో భారత సైనికులు జరిపిన ఎన్కౌంటర్లపై ఉగ్రవాదులు ప్రతీకార దాడికి పూనుకున్నారు. సోమవారం భారత ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఐదుగురు జవాన్లు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. కథువా జిల్లాలోని మాచేడి ప్రాంతంలో ఉగ్రవాదులు కొండపై నుంచి గ్రనేడ్లు, ఇతర మారణాయుధాలతో ఈ దాడి చేశారు.
వెంటనే తేరుకున్న సైనికులు ఎదురుకాల్పులు జరుపగా, ఉగ్రవాదులు పారిపోయారు. వారి కోసం గాలింపు జరుగుతున్నది. మరోవైపు రాజౌరీ వద్ద మాఝకోట్ సైనిక శిబిరంపై ఆదివారం తెల్లవారుజామున ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక జవాన్‌కు గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన ఆర్మీ ఎదురుకాల్పులకు దిగడంతో ఉగ్రవాదులు పరారయ్యారు.
కప్ బోర్డులో బంకర్లు
కుల్గాం జిల్లాలో శనివారం ఎన్కౌంటర్ సందర్భంగా ఉగ్రవాదులకు సంబంధించిన కొత్త విషయం బయటపడింది. చిన్నిగామ్ ఫీసల్ అనే గ్రామంలో జనావాసాల మధ్య ఇంటి కప్‌బోర్డులో ఉగ్రవాదులు నిర్మించుకున్న బంకర్ చూసి ఆర్మీ ఆశ్చర్యపోయింది. కప్బోర్డు ద్వారా లోపలికి దూరి వెళ్లే విధంగా నిర్మించిన ఈ బంకర్ పూర్తి కాంక్రీట్‌తో నిర్మించి ఉంది. కొన్నేండ్ల క్రితం ఉగ్రవాదులు సెప్టిక్ ట్యాంక్ కింద ఇలాగే బంకర్ ఏర్పాటు చేసుకోగా, దానిని సైనికులు కనిపెట్టి ధ్వంసం చేశారు. ఇప్పుడు ఉగ్రవాదులు కిచెన్లు, అల్మరాలు, డ్రాయింగ్ రూమ్‌ల వెనుక బంకర్లు ఏర్పాటు చేసుకుంటున్నట్టు ఆర్మీ గుర్తించింది.