చెన్నై: మరో వైద్య కుంభకోణం వెలుగుచూసింది. అక్రమంగా బాలిక అండాలు అమ్ముతున్న సంతానోత్పత్తి ఆసుపత్రుల బాగోతం బయటపడింది. దీంతో నాలుగు ఆసుపత్రులను శాశ్వతంగా మూసివేయాలని ఆరోగ్య మంత్రి ఆదేశించారు. తమిళనాడులో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్రంలోని పలు సంతానోత్పత్తి కేంద్రాలు నిబంధనలకు విరుద్ధంగా 16 ఏళ్ల బాలిక నుంచి అండాలు సేకరిస్తున్నాయి. అపరిపక్వ అండాల అమ్మకంపై ఆ బాలికను ఆమె తల్లి బలవంతం చేసింది. దీంతో పునరుత్పత్తి కోసం గుడ్డు కణాలను ఆ బాలిక నుంచి ఎనిమిది సార్లు సేకరించారు. దీని కోసం ఆమె ఆధార్ కార్డును ఫోర్జరీ చేశారు. ఆ బాలికకు పెళ్లి అయినట్లుగా, అండం దానం కోసం భర్త సమ్మతించినట్లుగాను నకిలీ పత్రాలు సృష్టించారు.
మరోవైపు ఈ స్కామ్ బయటపడటంతో తమిళనాడు ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్ సీరియస్‌గా స్పందించారు. సంతానోత్పత్తి ఆసుపత్రులు అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్టీ) చట్టాన్ని ఉల్లంఘించాయని ఆరోపించారు. నిబంధనల ప్రకారం పిల్లలున్న 21-35 ఏళ్ల వయస్సు మహిళలు ఒక్కసారి మాత్రమే అండ కణాలను దానం చేయడానికి అనుమతి ఉందన్నారు. అయితే దీనికి విరుద్ధంగా తల్లి బలవంతం మీద 16 ఏళ్ల బాలిక నుంచి పలుసార్లు అండాలను సేకరించారని తెలిపారు. ఆ సంతానోత్పత్తి కేంద్రాలకు క్వాలిఫైడ్ కౌన్సెలర్లు, అండ దాతకు లాభ, నష్టాల గురించి వివరించి సలహా ఇచ్చేవారు కూడా లేరని విమర్శించారు.
కాగా, విచారణ కమిటీ సిఫార్సు మేరకు ఆయా ఆసుపత్రులతోపాటు సంబంధిత వైద్యులకు రూ.50 లక్షల జరిమానా, ఏఆర్టీ చట్టం కింద పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ తెలిపారు. అలాగే నాలుగు ఆసుపత్రులను శాశ్వతంగా మూసివేయాలని ఆదేశించినట్లు చెప్పారు. చికిత్స పొందుతున్న రోగులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు రెండు వారాల సమయం ఇచ్చినట్లు తెలిపారు. అలాగే ఆధార్, పోక్సో చట్టాల కింద కూడా ఆయా ఆసుపత్రులపై చర్యలు ప్రారంభించామన్నారు.
మరో రెండు ఆసుపత్రులు రాష్ట్ర ఆరోగ్య బీమా పథకం కింద ఎంప్యానెల్‌మెంట్‌ను కోల్పోతాయని మంత్రి సుబ్రమణియన్ తెలిపారు. అలాగే ఈ కుంభకోణం రాకెట్‌తో సంబంధం ఉన్న ఆంధ్ర ప్రదేశ్, కేరళకు చెందిన ఒక్కో ఆసుపత్రిపై చర్యలకు తమిళనాడు ఆరోగ్య కార్యదర్శి సిఫార్సు చేస్తారని వెల్లడించారు.