భోపాల్: క్యాంపస్‌లో తలపెట్టిన హోలీ కార్యక్రమాన్ని కాలేజీ యాజమాన్యం రద్దు చేసింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు ప్రిన్సిపాల్, టీచర్లు సమావేమైన హాల్ డోర్ లాక్ చేసి బంధించారు. కాలేజీ యాజమాన్యం దీనిపై సీరియస్‌గా స్పందించింది. నలుగురు విద్యార్థులను కాలేజీ నుంచి బహిష్కరించింది. (Students Expelled For Locking Teachers) మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ సంఘటన జరిగింది. ప్రభుత్వ హోల్కర్ సైన్స్ కాలేజీ క్యాంపస్‌లో మార్చి 7న గ్రాండ్‌గా హోలీ వేడుక నిర్వహించాలని విద్యార్థులు ప్లాన్ చేశారు. ఫిబ్రవరి 23న అనుమతి తీసుకోకుండా కాలేజీలో పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఆగ్రహించిన యాజమాన్యం వాటిని తొలగించింది. అలాగే కాలేజీలో తలపెట్టిన హోలీ కార్యక్రమాన్ని రద్దు చేసింది.
కాగా, కాలేజీ యాజమాన్యం తీరు పట్ల విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 24న మహిళా ప్రిన్సిపాల్, ప్రొఫెసర్లు, విద్యార్థులతో సహా 150 మంది సమావేశమైన హాల్ డోర్‌ను బయట నుంచి లాక్ చేశారు. సుమారు అరగంట పాటు వారిని బంధించారు. సెమినార్ హాల్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
మరోవైపు కాలేజీ యాజమాన్యం ఈ సంఘటనపై సీరియస్‌గా స్పందించింది. విద్యార్థుల చర్యను తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యంగా దర్యాప్తు కమిటీ భావించింది. నలుగురు విద్యార్థి నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణా కమిటీ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో నలుగురు విద్యార్థులను కాలేజీ నుంచి బహిష్కరించినట్లు ప్రిన్సిపాల్ అనామిక జైన్ తెలిపారు. టీసీలు తీసుకుని వెళ్లిపోవాలని వారికి చెప్పినట్లు వెల్లడించారు.