హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): అమెరికాకు సంబంధించి స్టూడెంట్, బీ1(బిజినెస్), బీ2(టూరిస్ట్) వీసా పొందాలనుకునే భారతీయులకు ఇబ్బందులు తప్పడం లేదు. దేశంలో ఆయా ప్రధాన నగరాల్లో ఉన్న యూఎస్ కాన్సులేట్లలో వీసా ఇంటర్వ్యూకు ఏడాదికి పైగా వేచి ఉండాల్సి వస్తున్నది. చెన్నైలో వీసా ఇంటర్వ్యూకు గరిష్ఠంగా 14 నెలలు, కోల్కతాలో కనిష్ఠంగా 6 నెలల వరకు సమయం పడుతున్నది. హైదరాబాద్లో 7, న్యూఢిల్లీలో 8, ముంబైలో 9.5 నెలల సమయం పడుతున్నది. తాజాగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ బీ1, బీ2, స్టూడెంట్ వీసా ప్రక్రియ త్వరగా పూర్తి చేసేందుకు యూకే తరహా విధానాన్ని అమలు చేయనున్నది. ఇందుకోసం ఇప్పటికే ఓ పరిపాలన మెమో జారీ చేసింది. నాన్ ఇమిగ్రెంట్ వీసాల ప్రాసెస్ త్వరగా పూర్తి కావడానికి వెయ్యి డాలర్లు ఫీజు చెల్లించాలని పేర్కొంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ పైలెట్ ప్రాజెక్టును అమలు చేసేలా యూఎస్ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ విధానంతో త్వరగా వీసా స్లాట్ పొందే వీలుంటుందని వీసా కన్సల్టెంట్లు చెబుతున్నారు.
యూకే తమ దేశానికి వచ్చే విదేశీయుల కోసం ప్రియారిటీ(ప్రాధాన్యత) ఆధారంగా డబ్బులు చెల్లించి వీసాలను తొందరగా పొందే వీలు కల్పించింది. స్టాండర్డ్ వీసాను సుమారు రూ.62,951 చెల్లిస్తే 15 రోజుల్లో పొందే వీలు కల్పించింది. ప్రియారిటీ వీసాను సుమారు రూ.1,22,235 చెల్లించి 5 రోజుల్లో పొందొచ్చు. సూపర్ ప్రియారిటీ వీసాకు రూ.1,75,951 చెల్లిస్తే 1-2 రోజుల్లో వీసా పొందవచ్చు. ఇలాంటి విధానాన్నే అమెరికాలో అందుబాటులోకి తేనున్నట్టు ట్రంప్ సర్కారు ప్రకటించింది. ఈ మేరకు వెయ్యి డాలర్లు(సుమారు రూ.86,000)లు రుసుముగా నిర్ణయించింది. దీంతో వీసాల లాంగ్ క్యూను తగ్గించుకునే వెసులుబాటు కల్పించనుంది. నిర్ణీత ఫీజు చెల్లించడం ద్వారా వీసా దరఖాస్తుదారులు ఇంటర్వ్యూను తక్కువ కాల వ్యవధిలో మిగతా దరఖాస్తుదారులతో పోలిస్తే ముందుగా పూర్తి చేసుకునే వీలు కలుగనుంది.