Chemicals | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: ఆహార ప్యాకేజీ లేదా తయారీలో వాడే 3,600కు పైగా రసాయనాలను మనుషుల శరీరాల్లో గుర్తించినట్టు జర్నల్ ఆఫ్ ఎక్స్పోజర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎపిడెమియాలజీలో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. ఇందులో సుమారు 100 దాకా ఆరోగ్యానికి హానికరమైనవి ఉన్నాయని అధ్యయనానికి నేతృత్వం వహించిన బిర్గిట్ గుయెకా తెలిపారు. వీటిలో పీఎఫ్ఏఎస్, బిస్ఫెనాల్ ఎ లాంటి నిషేధిత జాబితాలో ఉన్న రసాయనాలు ఉన్నాయన్నారు.
గతంలో సుమారు 14 వేల ఫుడ్ కాంటాక్ట్ కెమికల్స్‌ను పరిశోధకులు గుర్తించారు. ఇవి వివిధ రకాల ప్యాకేజింగ్ పదార్థాలు, వంట పాత్రల నుంచి ఆహారంలో కలిసిపోయే సామర్థ్యం ఉన్నవి. అయితే తాజాగా కనుగొన్న 3600 రసాయనాలు ఫుడ్ ప్యాకేజింగ్ ద్వారానే శరీరంలోకి చొచ్చకు వెళ్లాయని అధ్యయనం తేల్చలేకపోయిందని.. ఇందుకు ఇతర కారణాలు ఉండొచ్చని గుయె కా అభిప్రాయపడ్డారు. పీఎఫ్ఏఎస్ రసాయనాలకు అనేక ఆరోగ్య సమస్యలకు సంబంధం ఉందని తెలిపారు. ప్యాకేజీ సామగ్రిని ఎక్కువ సేపు వాడొద్దని, ప్యాకేజ్డ్ ఆహారాన్ని వేడి చేయడాన్ని నివారించాలని ఆమె ప్రజలకు సలహా ఇచ్చారు.