ISIS | ముంబై : నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసీస్‌కు మద్దతు ఇచ్చి, నిధులు సమకూరుస్తున్నట్లు ఓ ఇంజినీర్‌పై ఆరోపణలు ఉన్నాయి. దీంతో మహారాష్ట్రకు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్(ఏటీఎస్) నాసిక్‌లో ఇంజినీర్(32)ను అరెస్టు చేసింది. ఐసీస్ ఉగ్రవాద సంస్థకు ఈ ఇంజినీర్ మూడుసార్లు నిధులు బదిలీ చేసినట్లు తమ విచారణలో తేలిందని ఏటీఎస్ అధికారులు తెలిపారు. ఇంజినీర్‌కు సన్నిహితంగా ఉంటున్నవారిని కూడా విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఐసీస్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తూ, నిధులు సమకూరుస్తున్న ఇంజినీర్‌పై ఉపా చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంజినీర్ కార్యకలాపాలను చాలా రోజులుగా నిశితంగా పరిశీలించి, అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఐసీస్‌తో సంబంధం ఉన్న ఓ విదేశీ సంస్థతో ఇంజినీర్ నిరంతరం కమ్యూనికేట్ అయినట్లు పోలీసులు గుర్తించారు.
ఇంజినీర్ నుంచి ఎలక్ట్రానిక్ డివైజెస్, మొబైల్ ఫోన్స్, సిమ్ కార్డులు, ల్యాప్‌టాప్, పెన్ డ్రైవ్‌తో పాటు నేరారోపణ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విచారణ అనంతరం అతన్ని కోర్టులో హాజరు పరిచామని, జనవరి 31వ తేదీ వరకు ఏటీఎస్ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరినట్లు పేర్కొన్నారు.