న్యూఢిల్లీ, డిసెంబర్ 17: జమిలి బిల్లుపై అధ్యయనానికి ఏర్పాటు చేయనున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)లో గరిష్ఠంగా 31 మంది ఎంపీలు ఉంటారు. అందులో 21 మంది లోక్‌సభకు చెందిన వారు. ఏకకాలంలో శాసనసభలకు, పార్లమెంట్‌కు ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా తెచ్చిన రాజ్యాంగ (129వ) సవరణ బిల్లును వీరు పూర్తిగా అధ్యయనం చేస్తారు.
జేపీసీ కూర్పును రాజ్యసభ స్పీకర్ ఓం బిర్లా 48 గంటల్లో ప్రకటించనున్నారు. పార్లమెంట్ సమావేశాలు శుక్రవారంతో ముగియనున్నందున ఈ డెడ్‌లైన్ విధించారు. ఆలోగా జేపీసీ ఏర్పడకపోతే బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే తిరిగి ప్రవేశపెట్టాలి. కమిటీలో ప్రాతినిధ్యం కోసం ఎంపీల పేర్లను ప్రతిపాదించాలని వివిధ పార్టీలను కోరినట్టు తెలిసింది. ఈ కమిటీ ఏర్పడిన తర్వాత 90 రోజుల్లో నివేదిక సమర్పిస్తుంది.