Boat capsize | ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో పడవ ప్రమాదం జరిగింది. ఇక్కడి సుమ్లీ నదిలో పడవ బోల్తా పడటంతో 30 మంది నీటిలో మునిగిపోయారు. వీరిలో ముగ్గురు చిన్నారులు చనిపోగా.. ఏడుగురిని బయటకు తీసి చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. కాగా, 20 మంది ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు.
మహ్మద్‌పూర్ ఖలా పోలీస్ స్టేషన్ పరిధిలోని బైరానా మౌ మజారి గ్రామంలో నది ఒడ్డున ప్రతి ఏటా పౌర్ణమి రోజున గారంగ్ దేవ్ వద్ద నిర్వహించే కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు పడవలో సుమ్లీ నది దాటేందుకు బయల్దేరారు. నది మధ్యకు రాగానే బోటు బ్యాలెన్స్ తప్పి బోల్తా పడింది. దాంతో పడవలోని 30 మంది నీట మునిగిపోయారు. వీరిలో ముగ్గురు చిన్నారులు చనిపోగా, 20 మంది ఈదుకుంటూ క్షేమంగా ఒడ్డుకు చేరినట్లు పోలీసులు తెలిపారు. ఏడుగురిని క్షేమంగా బయటకు తీసి స్థానిక దవాఖానకు తరలించినట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ ద్వారా సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు రీతూ యాదవ్ (14), ప్రియాంక (6) హిమాన్షు (8) ఉన్నట్లు గుర్తించారు. వీరు ముగ్గురు ఒకే గ్రామానికి చెందిన వారుగా తెలుస్తున్నది.