Navi Mumbai : మహారాష్ట్ర, నవీ ముంబైలో దారుణం జరిగింది. మూడేళ్ల చిన్నారిపై స్కూల్ వ్యాన్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అది కూడా స్కూల్ వ్యాన్లోనే లైంగిక దాడికి దిగాడు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలివి. నవీ ముంబైలో ఒక మూడేళ్ల చిన్నారి రోజూ స్కూల్ వ్యాన్‌లో పాఠశాలకు వెళ్లి వస్తుండేది. ఆ వ్యాన్‌లో స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చే చివరి చిన్నారి ఆ పాపే.
వ్యాన్‌లోని మిగతా వాళ్లు ముందే దిగిపోయేవారు. ఆ మూడేళ్ల పాప అందరికంటే చివరి స్టాప్‌లో దిగాలి. దీంతో మిగతావాళ్లు దిగిన తర్వాత వ్యాన్‌లో ఒంటరిగానే ఉండేది. ఈ క్రమంలో వ్యాన్ డ్రైవర్ పాపపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి ఇంటికి వచ్చిన తర్వాత తీవ్ర కడుపు నొప్పితో బాధపడింది. ఈ కడుపు నొప్పి గురించి పాపను తల్లిదండ్రులు ఆరా తీయగా.. స్కూల్ వ్యాన్ డ్రైవర్ తనతో ఎలా ప్రవర్తించింది చెప్పింది. పాప అత్యాచారానికి గురైనట్లు గుర్తించారు. ఈ విషయం తెలిసి షాక్ తిన్న తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. లాస్ట్ స్టాప్ వరకు వ్యాన్‌లో ఎవరూ లేకపోవడం, పాప ఒక్కర్తే ఉండటం వల్ల ఈ అత్యాచార ఘటన జరిగింది. డ్రైవర్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. అయితే, ఇలాంటి ఘటనలు తలెత్తకూడదనే ఉద్దేశంతోనే పిల్లలు ప్రయాణించే స్కూల్ బస్సుల విషయంలో ప్రభుత్వం కొన్ని రూల్స్ రూపొందించింది. దీని ప్రకారం.. స్కూల్ బస్సులో తప్పనిసరిగా ఒక మహిళా సిబ్బంది ఉండాలి. చివరి విద్యార్థి దిగేవరకు ఆ వ్యక్తి బస్సులోనే ఉంటూ, వారి రక్షణ బాధ్యతలు చూసుకోవాలి.
అలాగే, స్కూల్ బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు, ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి. దీని ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రయాణించే బస్సులను నిరంతరం మానిటరింగ్ చేయగలుగుతారు. అయితే, ఈ ప్రమాణాల్ని పాటించకపోవడం వల్ల విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది.