భోపాల్: వంకాయ కూరతో రోటీలు తిన్న తర్వాత అక్కాచెల్లెళ్లైన ముగ్గురు బాలికలు తీవ్ర అస్వస్థతకు గురై మరణించారు. కుటుంబ సభ్యులు ఆ పిల్లల మృతదేహాలను ఖననం చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, వైద్య బృందం కలిసి బాలికల మృతదేహాలను వెలికితీసి పోస్ట్మార్టం కోసం తరలించారు. (Baingan Bharta) మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పిపోరా ఖుర్ద్ గ్రామానికి చెందిన బాల్ముకుంద్ కుష్వాహ కుమార్తెలైన 7 ఏళ్ల పూనమ్, మూడేళ్ల మనీషా, 9 నెలల చిన్నారి చాహత్ అనుమానాస్పదంగా మరణించారు. శుక్రవారం రాత్రి భోజనంగా వంకాయ కూరతో చపాతీలు తిన్న తర్వాత ఆ ముగ్గురు పిల్లలు అస్వస్థతకు గురై చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతదేహాలను వారు ఖననం చేశారు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు, వైద్యులతో కలిసి ఆ గ్రామానికి చేరుకున్నారు. పిల్లల మృతదేహాలను పూడ్చిపెట్టిన స్థలాన్ని పరిశీలించారు. వారి మృతదేహాలను వెలికితీసి పోస్ట్మార్టం నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించి ఆధారాలు సేకరించారు. అయితే, బాలికల మరణాలకు తిన్న ఆహారానికి ఏమైనా సంబంధం ఉందా లేదా అనే విషయాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు.

Sisters Ate baingan Bharta, Dead
మరోవైపు పిల్లలు అనారోగ్యానికి గురై మరణించడంపై కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పోస్ట్మార్టం, ఫోరెన్సిక్ నివేదికలు అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి తెలిపారు. ముగ్గురు చిన్నారుల మరణాలకు దారితీసిన పరిస్థితులు అస్పష్టంగా, అనుమానాస్పదంగా ఉన్నాయని అన్నారు.