Akhilesh Yadav : ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌కు షాక్ తగిలింది. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అక్టోబర్ 14న యూపీ, అమేథీలోని గౌరి గంజ్‌లో జరగనున్న కార్యక్రమంలో ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారు. రాకేష్ ప్రతాప్ సింగ్, అభయ్ సింగ్, వినోద్ చతుర్వేది అనే ముగ్గురు ఎస్పీ ఎమ్మెల్యేలు భారీగా జరగబోయే కార్యక్రమంలో బీజేపీలో చేరుతారు.
ఈ ముగ్గురు ఇప్పటికే ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. యూపీలో 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఇందుకు ఆరు నెలల సమయం కూడా లేదు. అలాంటిది, ఈ సమయంలో తన పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ క్యాంపులో చేరడం అఖిలేష్ యాదవ్‌కు కచ్చితంగా పెద్ద దెబ్బే. అయితే, బీజేపీ ఎమ్మెల్యేలు చాలా మంది తనతో టచ్‌లో ఉన్నారని, వారంత ఎస్పీలో చేరబోతున్నారని అఖిలేష్ యాదవ్ ఇటీవలే ప్రకటించారు. అలాంటిది, ఇప్పుడు ఆ పార్టీ నుంచే ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతుండటం విశేషం. యూపీలో బీజేపీ వరుసగా గెలుస్తుండటంతో ఆ పార్టీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.
ఒంటరిగా పోటీ చేసి, ఓట్లు చీలి.. బీజేపీకి అధికారం కట్టబెట్టడం కంటే కూటమిగా పోటీ చేసి, బీజేపీని ఓడించాలని ఎస్పీ, కాంగ్రెస్, బీఎస్పీ వంటి పార్టీలు ఆలోచిస్తున్నాయి. అయితే, పార్టీల మధ్య సీట్ల విషయంలో ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఇటీవల ఎస్పీకి, కాంగ్రెస్ పార్టీకి మధ్య ప్రాథమిక చర్చలు జరిగాయి. దీనిలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి 50 సీట్లు ఇస్తామని ఎస్పీ ప్రతిపాదించింది. కానీ, తమకు 150 సీట్లు కావాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. దీంతో ఇరు పార్టీల మధ్య ఇంకా పొత్తు చర్చలు కొలిక్కిరాలేదు.