న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: ఒక పక్క పెరుగుతున్న భూతాపం, మరోపక్క అపరిమితంగా భూగర్భ జలాల తోడివేత వల్ల భవిష్యత్తులో భారత్లో తీవ్ర నీటి కొరత ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మన దేశంలో రైతులు ఎక్కువ శాతం భూగర్భ జలాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. రైతులు ఇదేవిధంగా భూగర్భ జలాలను తోడేయడం కొనసాగిస్తే 2080 నాటికి భూగర్భ జలాల క్షీణత ఇప్పుడున్న దానికంటే మూడు రెట్లు పెరుగుతుందని, తద్వారా దేశంలో ఆహార, నీటి భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఒక పరిశోధన వెల్లడించింది. అమెరికాకు చెందిన మిచిగాన్ యూనివర్సిటీ వారు చేసిన పరిశోధనల ప్రకారం రానున్న కాలంలో భూగర్భ జలాల పరిమాణం గణనీయంగా తగ్గిపోనుండటంతో దేశంలోని 140 కోట్ల పౌరుల జీవనానికి ఇబ్బందిగా మారుతుందని సైన్స్ అడ్వాన్వెస్ జర్నల్లో ప్రచురితమైన పరిశోధక నివేదిక హెచ్చరించింది. భూగర్భ జలాల అధిక వినియోగంలో భారత్ మొదటి స్థానంలో ఉందని, తద్వారా భవిష్యత్లో ఆహార భద్రతకు కూడా ముప్పు ఏర్పడుతుందని పరిశోధకుల్లో ఒకరైన ప్రొఫెసర్ మెహా జైన్ తెలిపారు.