బెంగుళూరు: బెంగుళూరుకు చెందిన చర్మ వైద్యురాలు డాక్టర్ కృతికా రెడ్డి హత్య కేసులో ఆమె భర్త, డాక్టర్ మహేంద్ర రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే కుమార్తె కోసం కట్టిన సుమారు మూడు కోట్ల విలువైన ఇంటిని ఇస్కాన్(ISKCON)కు ఆమె తండ్రి విరాళం ఇచ్చినట్లు తెలిసింది. కడుపు నొప్పికి చికిత్స అందిస్తున్న నెపంతో తన భార్య కృతికకు ప్రాణాంతకమైన అనస్థీషియా ప్రోపోఫాల్ను ఎక్కించినట్లు డాక్టర్ మహేంద్రపై ఆరోపణలు ఉన్నాయి. ఫోరెన్సిక్ వైద్యులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రొపోఫాల్ ఇచ్చినట్లు గుర్తించారు. దీంతో అక్టోబర్ 14వ తేదీన డాక్టర్ మహేంద్రను అదుపులోకి తీసుకున్నారు.
అయ్యప్ప లేవుట్‌లో కూతురి కోసం నిర్మించిన ఇంటిని ఇస్కాన్ టెంపుల్‌కు తండ్రి కే మునిరెడ్డి డొనేట్ చేశాడు. భర్త, పిల్లలతో కలిసి కూతురు సంతోషంగా ఉండాలని ఇళ్లు కట్టించాలని, కానీ తన కలలు చెదిరినట్లు ఆయన ఆరోపించారు. కృతికా, మహేంద్ర.. 2024 మే నెలలో పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో కృతిక అనుమానాస్పద రీతిలో ఇంట్లోనే ప్రాణాలు వదిలింది. గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నకృతికకు ఇంట్లోనే భర్త ట్రీట్మెంట్ ఇచ్చాడు. అయితే ఆర్నెళ్ల తర్వాత కృతికకు పరీక్షలు జరుపగా అత్యంత శక్తివంతమైన ప్రొపోఫాల్ అనస్థీషియాను ఆమెకు ఎక్కించినట్లు తేలింది. ఆస్పత్రుల్లో మాత్రమే వాడే ఆ అనస్థీషియాను భార్యకు వాడినట్లు తేల్చారు.
విక్టోరియా ఆస్పత్రిలో జనరల్ సర్జన్‌గా చేస్తున్న మహేంద్రను అక్టోబర్ 14వ తేదీన అరెస్టు చేశారు. చాలా చాకచక్యంగా భార్యను మహేంద్ర చంపినట్లు పోలీసులు పేర్కొన్నారు. కృతిక అవయవాల్లో అనస్థీసియా ఉన్నట్లు గుర్తించిన ఫోరెన్సిక్ అధికారులు ఆ కేసును మర్డర్‌గా తేల్చేశారు. కూతురి కోసం కట్టిన ఇంటిని ఇస్కాన్‌కు విరాళం ఇచ్చేశానని, మూడు నెలల క్రితమే అప్పగించానని, అక్కడ ఇస్కాన్ వాళ్లు కార్యక్రమాలు చేపడుతున్నారని, తన కూతురు ఆ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతుందని ఆశిస్తున్నట్లు ముని రెడ్డి తెలిపారు.