తిరువనంతపురం: కేరళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఆ పార్టీ వయనాడ్ అభ్యర్థి (BJPs Wayanad Candidate) కే సురేంద్రన్‌పై 242 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇందులో 237 కేసులు శబరిమల నిరసనలకు సంబంధించినవే కావడం విశేషం. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై వయనాడ్ నుంచి పోటీ చేస్తున్న ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్‌పై నమోదైన కేసుల వివరాలను ఆ పార్టీకి చెందిన వార్తా పత్రిక ద్వారా వెల్లడించారు. 242 కేసులకు సంబంధించిన వివరాలను మూడు పేజీల్లో ప్రచురించారు. అలాగే ఎర్నాకులం నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కెఎస్ రాధాకృష్ణన్‌పై కూడా 211 కేసులున్నట్లు అందులో పేర్కొన్నారు.
కాగా, కేరళ బీజేపీ అభ్యర్థులైన సురేంద్రన్, రాధాకృష్ణన్, అలప్పుజా అభ్యర్థి శోభా సురేంద్రన్, వటకర అభ్యర్థి ప్రఫుల్ కృష్ణపై నమోదైన కేసుల వివరాలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ శుక్రవారం ట్వీట్ చేశారు. ‘భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో జాతీయవాదిగా ఉండటం చాలా కష్టం. ఇది రోజువారీ పోరాటం. కానీ విలువైన పోరాటం. వయనాడ్ బీజేపీ అభ్యర్థి సురేంద్రన్ ఫారం సీ7. ఒక వ్యక్తి… వందల కేసులు’ అని అందులో పేర్కొన్నారు.