అహ్మదాబాద్: గుజరాత్లోని ఆనంద్ జిల్లాకు చెందిన విద్యార్థిని కెనడాలోని నియగారా ప్రాంతంలో ఈ నెల 15న దారుణ హత్యకు గురైంది. మృతురాలిని విధి మేఘా(22)గా గుర్తించారు. గత నాలుగేండ్లుగా ఆమె కెనడాలో నివసిస్తూ ఉన్నత చదువులు చదువుతున్నారు. తన జీవనం కోసం పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నారు. కెనడాలో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకొన్నారు. పట్టపగలు నడి రోడ్డుపై ఆమెపై దుండగులు కత్తితో దాడి చేశారని.. ఆమెను దోచుకొనేందుకు యత్నించినప్పుడు ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
స్థానికులు వెంటనే ఆమెను దవాఖానకు తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. ఆమె హత్య గురించి కాస్త ఆలస్యంగా దౌత్య వర్గాల ద్వారా ఆమె కుటుంబానికి తెలిసింది. నిందితుల వివరాలు ఇంకా తెలియలేదు. ఈ ఘటన విదేశాల్లో భారతీయులు, విదేశీ విద్యార్థులపై జరుగుతున్న దాడులపై మళ్లీ ఆందోళనలను రేకెత్తించింది.