UGC : దేశంలో మొత్తం 22 ఫేక్ యూనివర్సిటీలు (Fake universities) ఉన్నాయని ‘యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC)’ హెచ్చరించింది. ఢిల్లీలోని కోట్లా ముబారక్పూర్లోగల ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఇంజినీరింగ్ సంస్థ విషయంలో యూజీసీ మరోసారి హెచ్చరికలు చేసింది. ఆ యూనివర్సిటీ అనుమతులు లేని డిగ్రీ కోర్సులను నిర్వహిస్తోందని పేర్కొంది. ఆ సంస్థ జారీచేసే డిగ్రీలకు ఎలాంటి విలువ లేదని తెలిపింది. అసలు ఈ విశ్వవిద్యాలయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలకు సంబంధించిన ఏ చట్టాలకు లోబడి ప్రారంభించలేదని యూజీసీ స్పష్టం చేసింది.
యూజీసీ డేటా ప్రకారం దేశంలో 22 గుర్తింపులేని యూనివర్సిటీలను నిర్వహిస్తున్నారని తేలింది. వీటిల్లో 9 దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నాయి. వాటిలో ఐదు ఉత్తర్ప్రదేశ్లో ఉండగా.. మిగిలినవి కేరళ, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరిల్లో నిర్వహిస్తున్నట్లు యూజీసీ గణాంకాలు చెబుతున్నాయి. ఢిల్లీలోని విద్యార్థులను మాయచేసి ఈ విశ్వవిద్యాలయాలు ఆకర్షిస్తున్నాయి.
తమ సంస్థలకు పేర్లుపెట్టే సమయంలో ‘నేషనల్’, టెక్నాలజీ, మేనేజ్మెంట్, ఇన్స్టిట్యూట్ వంటి పదాలు వాడుతున్నారు. ఇక యూపీలో విద్యాపథ్, పరిషద్, ఓపెన్ యూనివర్సిటీ లాంటి పదాలను వినియోగిస్తున్నారు. విద్యార్థులు ఏదైనా సంస్థలో చేరే సమయంలో దాని పేరు సెక్షన్ 2 (ఎఫ్) లేదా 3 కింద యూజీసీ గుర్తించిన జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకోవాలి.
ఇక ఏఐసీటీఈ, పీసీఐ, ఎన్ఎంసీ వంటి కౌన్సిల్స్ నుంచి ఆయా సంస్థల్లో ఏ కోర్సుల నిర్వహణకు అనుమతులు లభించాయో సరిచూసుకోవాలి.