భోపాల్: రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మరణించాడు. అయితే ప్రమాదం జరిగిన ప్రాంతం తమ పరిధి కాదని రెండు రాష్ట్రాల పోలీసులు తెలిపారు. దీంతో ఆ వ్యక్తి మృతదేహం పలు గంటలపాటు ఆ రోడ్డుపై ఉంది. (Accident Victim’s Body) ఆగ్రహించిన గ్రామస్తులు రహదారిని దిగ్బంధించి నిరసన చేశారు. దీంతో స్థానిక పోలీసులు దిగి వచ్చారు. 27 ఏళ్ల రాహుల్ అహిర్వార్ పని కోసం ఢిల్లీ వెళ్లేందుకు ఆదివారం సాయంత్రం 7 గంటల సమయంలో ఇంటి నుంచి బయలుదేరాడు. రోడ్డు దాటుతుండగా ఒక వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో రాహుల్ అక్కడికక్కడే మరణించాడు.
కాగా, రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మరణించడాన్ని స్థానికులు గమనించి గుమిగూడారు. మధ్యప్రదేశ్‌లోని హర్పాల్పూర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. ఆ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి రాదన్నారు. పొరుగు రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లా మహోబ్‌కాంత్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మరోవైపు గ్రామస్తులు ఉత్తరప్రదేశ్‌లోని ఆ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. అయితే అది తమ పరిధి కాదని అక్కడి పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్ పోలీసుల పరిధిలోకి వస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో రాహుల్ మృతదేహం నాలుగు గంటలకుపైగా ఆ రోడ్డుపై పడి ఉంది.
కాగా, ఇరు రాష్ట్రాల పోలీసులు స్పందించక పోవడంపై గ్రామస్తులు ఆగ్రహించారు. రోడ్డును దిగ్బంధించి నిరసన చేపట్టారు. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇది తెలిసి రాత్రి 11 గంటలకు మధ్యప్రదేశ్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పోస్ట్‌మార్టం కోసం రాహుల్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. గ్రామస్తులు నిరసన విరమించడంతో ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.